రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): డా.ఎస్వీ, డా.భారతి సంపాదకత్వంలో వెలువడిన ‘యలమంచిలి విజయ్‌కుమార్‌ రచనలు ’ అనే గ్రంథాన్ని  తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నేదురుమల్లి రాజ్యలక్ష్మి  ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ 70వ దశకంలో అభ్యుదయ సాహిత్య ఉద్యమకారులపై సైద్ధాంతిక ప్రభావం చూపిన నిశ్శబ్ద సైనికుడు యలమంచిలి విజయ్‌కుమార్‌ అని అభివర్ణించారు.

గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ద్వారా వారి ఆదర్శాలను ఈతరానికి అందించినవారిమవుతామన్నారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గొప్పవ్యక్తులు అక్షరాలలో నిక్షిప్తమై చిరంజీవులుగా నిలిచిపోతారని అన్నారు. భారతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడి దారి వ్యవస్థలపై అధ్యయనం చేసిన గొప్ప ఆర్థికవేత్త యలమంచిలి అని తెలిపారు. ప్రముఖ పాత్రికేయుడు ఆర్‌.వి.రామరావు యలమంచిలి జీవిత చరిత్రను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి కుటుంబ సభ్యులు, డా.ఏటుకూరి ప్రసాద్‌, డా.వై.సవితాదేవి, శ్రీరామమూర్తి, వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య అలేఖ్య పుంజల, ఆర్‌.రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.