తెలుగు కవిత్వాన్ని జన సామాన్యం చెంతకు చేర్చిన కవి - కె.శ్రీనివాస్‌
ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు సినారె ప్రతిభా పురస్కారం

ఆంధ్రజ్యోతి,హైదరాబాద్: సినారెలాంటి గొప్ప కవి పేరిట నెలకొల్పిన అవార్డును అందుకోవడం అవార్డుగ్రహీతల అదృష్టమని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. సభికులంతా హర్షించేలా సినారె ప్రతిభా పురస్కారగ్రహీతలు ఉండడం సంతోషకదాయకమని అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి రచయితగా 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జె.బి.రాజు ఫౌండేషన్‌, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సంయుక్తాద్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సినారె సినీగీత స్వర్ణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌తో
పాటు ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ, వంశీరామరాజు, వై.కె.నాగేశ్వరరావు, ఆర్‌.శ్యామ్‌సుందర్‌లకు సినారె ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ అవార్డులు అందుకోవాలంటే అర్హత ఉండాలని, సినారె అవార్డుల కోసం ఎంపిక చేసిన అవార్డుగ్రహీతలు గొప్పవారని అన్నారు. అవార్డుగ్రహీతలందరూ నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని రోశయ్య ఆశీర్వదించారు. ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ సినారె కవిత్వానికే గ్లామర్‌ తీసుకొచ్చారని అన్నారు. సినారె లేని సాహితీ సభలు ఉండేవి కావని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నతమైన కవి సినారె అని ఆయన కొనియాడారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు కవిత్వాన్ని జనసామాన్యం మధ్యకు తీసుకెళ్లిన కవిగా సినారె స్థానం గొప్పదని అన్నారు. తెలుగు కవి ఒక సెలబ్రిటీగా మారడం సినారె విషయంలో చూడవచ్చునన్నారు. ఆయన సినీ జీవితం కూడా అందుకు దోహదం చేసిందని అన్నారు. పురస్కారగ్రహీతలు వంశీరామరాజు మాట్లాడుతూ సినారె తమకు గురువుతో సమానమని అన్నారు. దళితనేత జె.బి.రాజు మాట్లాడుతూ సినారె గొప్ప కవి అని అభివర్ణించారు. తెలుగు సాహిత్యానికి సినారె చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎన్‌.సింగ్‌, బండారు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు శృతిలయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ప్రముఖ గాయని ఆమని నేతృత్వంలో సినారె రాసిన పాటలను ఆలపించి అలరించారు.