విభిన్న కథలు రావాలి : ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌

డిచ్‌పల్లి, నిజామాబాద్, మార్చి 14 : తెలంగాణ సాహిత్యంలో కథకు అత్యంత ప్రాధాన్యం ఉందని, కథలు ప్రాంత అస్థిత్వాన్ని, సామాజిక పరిస్థితులను తెలియజేస్తాయని సాహిత్య అకాడమి చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన కథ రచన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో వందేళ్లకు ముందే కథలు వచ్చాయన్నారు. అప్పటి పరిస్థితులను తెలియజెప్పే విధంగా కథలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రాం తానికి ఎంతో విలువైన సాహిత్యం ఉందన్నారు. కథలు ఈ ప్రాంత ఎన్నో ఉద్యమాలకు కీలకంగా మారాయన్నారు. సాహిత్యం ఉద్యమాన్ని బలోపేతం చేసిందన్నా రు. సాంస్కృతిక ఉద్యమం కీలకంగా పనిచేయడం వల్లనే రాజకీయ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

తెలంగాణ సాహిత్య సరిహద్దులను చెరుపుకొని కథల పరిధి పెరగాలని, అన్ని రకాల కథలు రావాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ కథకు 120 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉందన్నారు. ఆంధ్రప్రాంతంతో పోలిస్తే అక్కడ వచ్చిన న్ని విభిన్న కథలు తెలంగాణలో రాలేదన్నారు. తెలంగాణ ఎక్కువకాలం నిజాం పాలనలో ఉండడం, ఉర్దూభాష అధికారికంగా ఉండడం వల్ల సాహిత్యంలో కొత్త పోకడలు అనుకున్న విధంగా రాలేదన్నారు. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ పాలన ఉండడం, అక్కడ ఇంగ్లిష్‌, తెలుగు భాషలు బోధించడం వల్ల ఎక్కువ కథలు వచ్చాయన్నారు. మధ్య తరగతి సమాజం ఎక్కువగా ఉండడం వల్ల విభిన్న కథలు ఎక్కువగా వచ్చాయన్నారు. నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో మూడుశాతం అక్షరాస్యత ఉండడం ఆంధ్ర ప్రాంతంలో పదిశాతానికి పైగా అక్షరాస్యత ఉండడం వల్ల అక్కడ ఎక్కువ కథలు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో అచ్చమాంబ, మాడపాటి హన్మంతరావ్‌, కాళోజీ, అవధాని వంటి కవులు కథలను కూడా రాశారన్నారు. వారి తర్వాత ఎంతో మంది కథ రచనలు చేశారన్నా రు. నవీన్‌ వంటి వారు విభిన్న కథలను రాశారన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే కథలు వచ్చాయన్నారు. వీటికి మాత్రం తగినంత గుర్తింపు రాలేదన్నారు.