రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు వన్నె తెచ్చేలా నటించిన గొప్ప నటి కవిత అని రాజ్యసభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ 47వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటి, బీజేపీ నాయకురాలు కవిత నాలు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం సందర్భంగా ఆమెకు స్వర్ణకంకణం ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా కవిత రాణిస్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో మంచి పదవులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన రమణాచారి మాట్లాడుతూ తన నటనతో తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటి కవిత అని ఆయన అన్నారు. నలభై సంవత్సరాలుగా సినీ జీవితం గడపడం సంతోషకరమని అన్నారు. కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న వంశీరామరాజు 70ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కవితను సత్కరించడం ఆనందకరమని అన్నారు. అలనాటి నటి జమున మాట్లాడుతూ కవిత మంచి కళాకారిణి అని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞతో ఇటు నటన, అటు రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. 

కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, గిరిబాబు, రేలంగి నరసింహారావు, గీతాంజలి, రోజారమణి, బండారు సుబ్బారావు, వై.రాజేంద్రప్రసాద్‌, వంశీరామరాజు, తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి తదితరులు పాల్గొని కళారంగంలో విశిష్ట సేవలందిస్తున్న మురళి, కాలువ మల్లయ్య, ఉత్తేజ్‌, మృత్యుంజయ, రత్నశ్రీ, సత్యనారాయణ, నిహాల్‌, రామకృష్ణ, డాక్టర్‌ భవాని, సిరిసిల్ల రాజేశ్వరి, శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులను వంశీ-కళారత్న పురస్కారాలను అందజేశారు. సభకు ముందు నిర్వహించిన సంగీత విభావరి శ్రోతల్ని అలరించింది.