26-03-2019, (ఆంధ్రజ్యోతి): ‘‘అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ సంబరాలు దిగ్విజయం కావాలని శ్రీవారిని వేడుకున్నా’’ అని ఆ సంస్థ అధ్యక్షుడు సతీశ్‌ వేమన చెప్పారు. సోమవారం ఉదయం ప్రారంభ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘‘తానా మహాసభలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ను ఆహ్వానించాం. దేశంలో ఇతర ప్రముఖులను ఆహన్వించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 2007 తర్వాత మళ్లీ ఈ ఏడాది వాషింగ్టన్‌ డీసీలో నిర్వహిస్తున్నాం.

2007లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, చంద్రబాబు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. అలాగే తొలిసారిగా తానా వేదికపై టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తాం. తాళ్లపాకలో 600 మంది కళాకారులతో విజయవంతంగా నిర్వహించిన ‘ఎప్పటికీ అన్నమయ్య’ కార్యక్రమాన్ని అదే స్ఫూర్తితో అమెరికాలోని అన్ని నగరాల్లో నిర్వహిస్తాం’’ అని సతీశ్‌ వివరించారు.