కులమతాల మధ్య చిచ్చుపెడుతున్నారు

నా ఇంట్లో మారణాయుధాలా?

పోలీసులతో వచ్చి చూసుకో: టీజీ వెంకటేశ్‌

కర్నూలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య కోమటోళ్లు స్మగ్లర్లు అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పుస్తకం రాయడానికి స్వేచ్ఛ ఉండవచ్చు. ఇతర సామాజిక వర్గాల పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే రాజ్యాంగం ఒప్పుకోదు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఈయనను దేశ ద్రోహిగా గుర్తించి చట్టపరంగా శిక్షించాలి’ అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కర్నూలులోని మౌర్యాఇన్‌ దర్బార్‌ హాలులో ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆర్యవైశ్యులు స్మగ్లర్లు అంటూ మమ్మల్నే కాదు.. చనిపోయిన మా పూర్వీకులను కూడా ఐలయ్య నిందిస్తున్నారు. హిందువులను, చివరకు గాంధీజీని కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు.

హైదరాబాద్‌లో 75 శాతం వ్యాపారాలు చేసేది ఇతర కులాలే. ఆర్యవైశ్యులు 25 శాతం వ్యాపారమే చేస్తున్నారు. ఇతర వర్గాలను నిందించగలవా’ అని నిలదీశారు. తన రచనల ద్వారా వేల మంది మరణాలకు కారణం అవుతున్న ఐలయ్యను చట్టాన్ని సవరించి ఉరి తీయాలని అన్నామని, ఆ రకంగా వందసార్లు ఉరితీసినా తప్పులేదని పునరుద్ఘాటించారు.

‘మా ఇంట్లో మారణాయుధాలు, బాంబులు ఉన్నాయని, సోదాలు చేయాలని అంటున్నావు. ఐలయ్యతో పాటు పోలీసులు కూడా వస్తే గౌరవప్రదంగా ఆహ్వానిస్తాం. సోదాలు చేసుకోవచ్చు. మారణాయుధాలు, బాంబులు లేకపోతే ప్రొఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తావా’ అని సవాల్‌ విసిరారు. ‘విదేశాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ లూటీ చేస్తుంటే వారి గురించి ఐలయ్య మాట్లాడరు. ఎందుకంటే ఆయన పుస్తకాలకు డబ్బులిచ్చేది వారే! ఆయన ఇప్పటికైనా తప్పు తెలుసుకొని పుస్తకం రద్దు చేసుకోవాలి. మాకు క్షమించే గుణం ఉంది. లేదంటే ఆయనపై ఎంతదాకైనా ఆందోళన కొనసాగిస్తాం’ అని టీజీ అన్నారు. తనపై హైదరాబాద్‌లో ఐలయ్య పెట్టిన హత్యాయత్నం కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని టీజీ పేర్కొన్నారు