టాంటెక్స్ 136వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సుఉత్తర టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు నవంబరు 18న ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా సదస్సు ప్రారంభమైంది. 136 నెలలుగా ఉత్తమ సాహితీవేత్తలతో సాహిత్య సదస్సులు నిర్వహించటం గొప్ప విశేషమని సాహిత్యాభిమానులు ఈ సందర్భంగా కొనియాడారు. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఈ సదస్సుకు హజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంజుల తెలిదేవర శిష్య బృందం సంజన, హమ్సిక, అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభమయింది. తరువాత సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి, జాతీయాలు, పొడుపు కథల గురించి ప్రశ్నలు అడిగి సభికుల్లో ఆసక్తి రేకెత్తించారు. అంతేకాకుడా చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాల గురించి వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్ర, పరిణామక్రమాన్ని వివరించారు. డా.పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా.ఆళ్ళ శ్రీనివాస్‌రెడ్డి రాగ యుక్తంగా ఎంకి పాటలు పాడి సభికులను అలరించారు.ముఖ్య అతిథి మల్లవరపు అనంత్‌ను మద్దుకూరి చంద్రహాస్ సభికులకు పరిచయం చేశారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిని పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ, శ్రీ శ్రీ అభ్యుదయ కవి, విప్లవ కవి. అలాంటి శ్రీ శ్రీ రచనల్లో హాస్యం వెతకడం సాహసమే అవుతుందన్నారు. శ్రీ శ్రీ రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని గురించి వివరిస్తూ, అందులోని హాస్య చతురతను సభికులకు వివరించారు. అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాలందించడం నిజంగా అభినందనీయమని అనంత్ పేర్కొన్నారు.