గడ్డం మోహన్‌రావుకు కేంద్ర సాహిత్య అవార్డు
బాల సాహిత్యంలో బెలగంకు పురస్కారం

న్యూఢిల్లీ, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ 2019 సంవత్సరానిగానూ యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం అగర్తలలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర కంబారా నేతృత్వంలో జరిగిన కార్యనిర్వాహక బోర్డు అవార్డుకు ఎంపికచేసిన రచయితలు, కవుల పేర్లను అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ రెండు కేటగిరిల్లోనూ తెలుగువారికి అవార్డులు లభించాయి. యువ పురస్కారానికి ‘కొంగవాలు కత్తి’ అనే తొలి చిందు నవలకుగాను తెలంగాణకు చెందిన గడ్డం మోహన్‌ రావు ఎంపికయ్యారు. తెలంగాణలో చిందు కళకు ఉన్న విశేష ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఈ నవలను రచించారు. బాల సాహిత్య పురస్కారానికి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘తాతమాట-వరాలమూట’ అనే కథల సంపుటికి అవార్డు లభించింది. వివిధ భాషల్లో కలిపి బాలసాహిత్యంలో 22 మంది, యువ సాహిత్యంలో 23 మంది అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి జ్ఞాపికతోపాటు రూ.50వేలు చొప్పున నగదును అందిస్తారు. నవంబరు 14న బాలసాహిత్య పురస్కారాన్ని అందిస్తారు. ఎంపికైన వారికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ అభినందనలు తెలిపారు.