రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే భాషలో తియ్యదనం ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి మినీ హాల్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కావ్యపరిమళం-6 ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నగంటి తెలగనార్య రచించిన ‘యయాతి చరిత్ర’ పుస్తకం పై ప్రసంగించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కావ్యపరిమళం పేరిట తెలంగాణలో ప్రాచీన గ్రంథాలను విశ్లేషిస్తున్నామని అన్నారు. తెలంగాణ సాహిత్యాభివృద్ధిలో భాగంగా కావ్యపరిమళం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఆచార్య రవ్వాశ్రీహరి ప్రసంగిస్తూ ‘యయాతి చరిత్ర’ పుస్తకంలో భాష, మాండలికాలపై విపులంగా విశ్లేషించారని అన్నారు. ఈ సభకు అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.