16-12-2017: తమిళనాడులోని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నుంచి డి.లిట్‌. అందుకున్న తొలి వ్యక్తి ఆయన. ఇప్పుడు అదే విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధిపతి. తమిళనాట తెలుగుదనాన్ని పరిరక్షించేందుకు విశేష కృషి చేస్తున్న ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌ ప్రపంచ తెలుగు మహాసభలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. తమిళనాట తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలు, మాతృభాష కోసం తమిళులు అనుసరిస్తున్న విధానాల గురించి ఆయన ఏమంటున్నారంటే...తమిళనాడులో తెలుగు భాష దీన స్థితిలో ఉంది. దాదాపుగా వెంటిలేటర్‌పై ఉందని చెప్పొచ్చు. 2006లో అక్కడ పాఠశాలల్లో నిర్బంధ తమిళం ప్రవేశపెట్టారు. దాంతో తెలుగు విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారి పిల్లలు ఎక్కువ నష్టపోతున్నారు. 

చాలా మంది తెలుగు విద్యార్థులు తమిళ మాధ్యమంలో చదువు సాగించక తప్పడం లేదు. కొన్ని వేల మంది తెలుగు విద్యార్థులు మాతృభాషకు పూర్తిగా దూరమవుతున్నారు. ఆ నేలలో తెలుగు జాడ అంతరించిపోయే ప్రమాదం పొంది ఉంది. ఇది ప్రధాన సమస్య. ఈ విషయంలో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస చొరవ తీసుకోలేదు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ మంత్రుల్ని కలిశాం, ఉన్నతాధికారుల్ని కలిశాం. కానీ ఫలితం లేదు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకొని, తమిళనాడులో తెలుగు భాష మీద ముసురుకున్న చీకట్లను తొలగించేందుకు ప్రయత్నిం చాలని వేడుకుంటున్నాం.నానాటికీ తీసికట్టుగా పరిశోధనలుతెలుగు సాహిత్యానికీ, పాత్రికేయానికీ పుట్టినిల్లు తమిళనాడు. తెలుగు వైతాళికులు ఎందరో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. మా తెలుగు శాఖ ద్వారా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లోకన్నా మద్రాసు వర్సిటీ తెలుగు పరిశోధనల్లో మెరుగ్గా ఉందని చెప్పొచ్చు.‘‘ద్రవిడ భాషలు’’, ‘‘తులానాత్మక సాహిత్యం’’ గురించి అధ్యయనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రాచీన, ఆధునిక సాహిత్యంతోపాటు, తెలుగునాట ఈ మధ్యకాలంలో వస్తున్న కవిత్వం, కథ, నవల వంటి అన్ని సాహిత్య ప్రక్రియలపైనా పరిశోధనలు సాగుతున్నాయి. ప్రెసిడెన్సీ కాలేజీ, మద్రాసు యూనివర్సిటీ నుంచి ఏడాదికి ఇరవై మంది ఎంఫిల్‌ పూర్తిచేస్తున్నారు. ఇరవై మంది పీహెచ్‌డీలో చేరుతున్నారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వస్తూండడం మంచి పరిణామం. అయితే, ఇటీవల కాలంలో తెలుగు పరిశోధన తీసికట్టుగా ఉంది. ఏయేటికాయేడు ఆ స్థాయి తగ్గుతోంది. దానికి ఒకర్ని నిందించలేం. వ్యవస్థలోనే ఆ లోపం ఉందనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో వస్తున్న పరిశోధకుల్లో త్వరగా డిగ్రీ పొందాలి, ఉద్యోగం సంపాదించాలన్న ఆసక్తే ఎక్కువ కనిపిస్తోంది. ఏమైనా సాధించాలి. కొత్త విషయాలను వెలుగులోకి తేవాలన్న తపన తక్కువగా ఉంటోంది.