సాహిత్యం, చరిత్రను చదివించే అప్లికేషన్లు

రామాయణం మొదలు.. చాణక్య కథల వరకు..
గూగుల్‌ ప్లే స్టోర్‌లో వేలాది అంశాల్లో..
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అపురూప అక్షరాలు..
 
యాప్స్‌ .. యాప్స్‌ .. యాప్స్‌.. ఇప్పుడు ఎవరి నోట విన్నా యాప్స్‌ గురించే. అంతలా వ్యక్తిగత జీవితంతో మమేమకమయ్యయి. డెవలపర్లకు భాష కూడా వ్యాపారం కావడంతో మన తెలుగు భాషలో వేలాది అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వాడేవారికి ఈ యాప్స్‌  సుపరిచితం.  ఆబాలగోపాలాన్ని అలరించే ఎంకి పాటల మొదలు పేరెన్నిక గల దిగ్గజాల  సాహితీ చర్చల సమాహారం యాప్స్‌ రూపంలో ఉచితంగా లభిస్తోంది.  ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉపయుక్తమైన అప్లికేషన్లు మీకోసం..
 
 తలకట్టుతో రాజఠీవిని ప్రదర్శించే తీయని తెలుగు టెక్నాలజీ ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉపయోగించే వారందరికీ తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవడానికి వేలాది అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.  తాళపత్ర గ్రంథాల్లోని  అపురూప రచనలు యాప్స్‌లో లభిస్తున్నాయి. ఆ తరం గాయకుల తీయని సినీ గేయాలు, జానపద పాటలు అందించే అప్లికేషన్లు ఉన్నాయి. ఇతిహాసాలను చదవడానికి పెద్ద పెద్ద పుస్తకాలను కొననవసరం లేకుండానే ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు లోగిళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు  ప్రతీ క్షణం గ్రహ గమనాల ప్రకారం జరుగుతుందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. వారి కోసం జాతకం, పురాణ కథల సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోఉంది.  గూగుల్‌ ప్లేస్టోర్‌లో తెలుగు ప్రక్రియలో  మనకు కావాల్సిన పేరుతో సెర్చ్‌ చేస్తే చాలా యాప్స్‌ కనిపిస్తాయి. వాటి రివ్యూలను చదివి మెరుగ్గా ఉన్నవాటినే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పనిచేసేవి ఉన్నాయి.
 
తెలుగు జాతకం
ఈ పేరుతో పదుల కొలది యాప్స్‌ గూగుల్‌ స్టోర్‌లో ఉన్నాయి. వాటిలో అధిక రేటిగ్‌ ఉండి ఉచితంగా సేవలందించే వాటిని ఎంచుకోవాలి. చాలా యాప్స్‌లో   తెలుగు జాతకం, వధూవర గుణ మేళనం, నవజాత శిశజాతకం, రాశి ఫలములు, పంచాంగం, జోతిష్య పాఠాలు ఉన్నాయి. తెలుగు జాతకం యోగాలు, కాలసర్పదోషం, పరిహారాలు కూడా వివరంగా ఉన్నాయి.
మహాభారతం
పంచ పాండవులు, కౌరవుల బాల్యం నుంచి, వారి పోరాటాలు, వ్యూహాలను ఈ యాప్‌లో చదవవచ్చు. ఆడియో రూపంలో కూడా వినొచ్చు. ఆదిపర్వం, సభాపర్వం, వనపర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వంలోని  విశేషాలను క్లిప్‌ఆర్ట్‌ చిత్రాలతో పొందుపర్చారు.  వాటితో పాటు చాగంటి కోటేశ్వరరావు ప్రవచరాలు కడా ఇందులో ఉన్నాయి.
 
రామాయణం
 తెలుగులో రామాయణం చదవడానికి, వినడానికి ఈ యాప్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ చక్కని చిత్రాలతో వివరించారు. రాముడి ఫొటోలు ఎంతో బాగున్నాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది.
 
నీతి కథలు
తెలుగు భాషలో  కథలు ఎంతో మధురంగా ఉంటాయి. చిన్న పదాలతో చక్కని భావవ్యక్తీకరణతో నీతిని బోధించే కథలు అనేకం ఉన్నాయి. వాటిలో చాణక్య నీతి కథలు ఎంతో ప్రముఖమైనవి. ఎన్నిసార్లు చదివినా ప్రతీసారి కొత్తగానే అనిపిస్తాయి. ఇంకా.. పిల్లలను, పెద్దలను ఆకట్టుకు నే నీతి కథల యాప్స్‌ చాలా ఉన్నాయి. 
 
భగవద్గీత
ఈ పేరుతో గూగుల్‌ యాప్‌లో టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే యాప్‌ కనిపిస్తుంది. దీనిలో అర్జున విషాద యోగం,  సాఖ్యయోగం, కర్మయోగం, జ్ఞాన యో గం, కర్మసన్యాస యోగం, అత్మ సంయమ యో గం, జ్ఞాన విజ్ఞాన యోగం వివరించారు. చిత్రాలు ఆకట్టుకునే విధంగా పొందుపర్చారు.
 
కాలజ్ఞానం
వీరబ్రహ్మేందస్వామి చెప్పిన కాలజ్ఞానం తెలుగు నేలలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రచారం పొందింది. ఆ వివరాలు శ్రావ్యమైన పాఠల రూపంలో వినడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.
 
తెలుగు స్తోత్రాలు
వేంకటేశ, నవగ్రహ, శివ, ఆంజనేయ, విష్ణుం, సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు ఆ యాప్‌లో ఉన్నాయి. గణపతి వన్దనమ్‌, జఙ్కటనాశన గణేష్‌ స్తోత్రం, విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, అంజనేయ భుజంగ స్తోత్రం, హనుమాన్‌ చాలీసా, హనుమన్నమస్కారం వినసొంపైన గాత్రంతో అందుబాటులో ఉన్నాయి.
 
వార్తా కథనాల.. ఆంధ్రజ్యోతి
ఎప్పటి కప్పుడు వార్తాంశాలను పాఠకులకు అందించడానికి ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛమైన తెలుగులో కథనాలు అందించడానికి గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ ఉచితంగా ఉంది. ఆడియో, వీడియో, కథనాలు, విశ్లేషనలు, మార్కెట్‌ సమాచారం, ఒకటేమిటి.. సర్వం ప్రపంచ సమచారం ఈ యాప్‌తో మీ ముందుంటుంది.