16-12-2017: ‘‘ముత్యాల్లాంటి తెలుగు అక్షరాలంటూ లిపి మీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవటం మాని రోమన్‌ లిపిలో తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగంలోకి వెళ్తుందని నా నిశ్చితాభిప్రాయం. ప్రపంచ తెలుగు మహాసభ వారు ఈ విషయమై ఆలోచించటం మంచిదని నేను అనుకుంటున్నా..’’ అనంతం పేజీ 196.1975లో తెలుగు మహాసభల సందర్భంగా మహాకవి శ్రీశ్రీ వెలువరించిన అభిప్రాయం. దీనిపైన ఇప్పటికైనా చర్చ జరగాల్సిన అవసరం ఉందనేవారు అనేక మంది. వీరిలో ఒకరు సి.హెచ్‌. వెంకటేశ్వర్లు. తెలుగు పండితుడిగా పిల్లలకు పాఠాలు బోధించే వెంకటేశ్వర్లు ఈ విషయంలో విశేష పరిశోధన చేశారు. ‘ ప్రపంచ తెలుగు మహాసభల’ నేపథ్యంలో ఆయన అభిప్రాయాలివి..పిల్లలు తెలుగు నేర్చుకోవటానికి భయపడుతూ ఉంటారు. దీనిలో లిపి పాత్ర ఎంత?

11వ శతాబ్దానికి పూర్వం తెలుగులో కేవలం 36 అక్షరాలు మాత్రమే ఉండేవి. తెలుగు లిపిలో ఒత్తులు, ద్విత్వ, సంయుక్త, సంశ్లేష పదజాలాలు ఉండేవి కావు. ఆ తర్వాత తెలుగుపై సంస్కృత ప్రభావం బాగా పెరిగింది. దీనితో మరో 20 అక్షరాలు వచ్చి చేరాయి. దీని వల్ల భాష సంక్లిష్టమయింది. అంతేకాదు.. ఒకప్పుడు తెలుగులో తొలుత 19 అచ్చులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి 15గా మారాయి. దీనికి కారణం ప్రత్యామ్నాయ అక్షరాలు. లు, లూ, బూ, అరసున్నాలు ఒకటో తరగతి వాచకంలో ఉండవు. కానీ ఇవి రెండవ తరగతిలో ఉంటాయి. దీని వల్ల పిల్లలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.తెలుగు భాషపై సంస్కృత పదాల ప్రభావం మాటేమిటి?మనకు అనేక కమ్మనైన తెలుగు పదాలున్నాయి. కానీ వాటిని పిల్లలకు నేర్పకుండా సంస్కృతం నేర్పుతాం. ఉదాహరణకు పిట్ట అనే పదం విస్తృతప్రచారంలో ఉన్నప్పుడు ఖగం అని ఎందుకు వాడాలి. డోలు అనే పదం ఉన్నప్పుడు డమరు అనే పదాన్ని ఎందుకు నేర్పాలి? ఈ రెండే కాదు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

తెలుగుభాషను పిల్లల దగ్గరకు ఎలా తీసుకురాగలం..లిపిలో చిన్న చిన్న సంస్కరణలు తీసుకురావటం ద్వారా పిల్లలలో గందరగోళం తొలగిపోతుంది. ఉదాహరణకు ‘క’కు కింద భాగంలో చిన్న నిలువ గీత (1) సహాయంతో- ‘క’ను ఖగా మార్చవచ్చు. దీని వల్ల మహాప్రాణి అక్షర శబ్దాన్ని సులభంగా గుర్తించగలుగుతాం. దీని వల్ల క,గజ,ట,త అల్ప ప్రాణాలకు పూర్తి భిన్నంగా ఉన్న మహాప్రాణాలను నేర్చుకోవటంలో ఉన్న గందరగోళం పోతుంది. గ1, జ1, ట1,త1’- ఇలా అక్షరాల పక్కన చిన్న గీతలు పెట్టడం వల్ల పిల్లలకు నేర్చుకోవటం సులభం అవుతుంది. అంతే కాకుండా ఒత్తుల అవసరం లేకుండా ప్రాచీన ద్విత్వ, సంయుక్త, సంశ్లేష పదాలను రాయగలుగుతాం.