17-12-2017 హైదరాబాద్‌: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ ఒడిస్సా సాహితీ దిగ్గజం సీతాకాంత మహాపాత్ర ఒడిస్సా, ఆంగ్ల మూలం ‘భరతవర్షం’ తెలుగు అనువాద గ్రంథం శనివారం ఉదయం పార్కు హోటల్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతాకాంత మహాపాత్ర మాట్లాడుతూ సమయం కంటే ముందున్న ఈ నేల, ఒక గొప్ప నాగరికత జ్ఞాపకాల్లో పవిత్రమైందని ఉటంకించారు. తొమ్మిది సర్గాల ఈ దీర్ఘ కవిత ద్వారా ప్రకృతి పట్ల తన భావనను వ్యక్తీకరించడానికి ప్రయత్నించానని చెప్పారు. నా కలలు, ఆశలు, క్రోథానికి వ్యథకు ఈ పుస్తకం వీలునామా, ఇదొక విధమైన జ్ఞాపకమంటూ అభివర్ణించారు. ‘భరతవర్షం’ కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన ప్రముఖ కవి ముకుంద రామారావుకి ధన్యవాదాలు తెలిపారు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధ మహాకవి సీతాకాంత మహాపాత్ర రచించిన ‘భరతవర్షం’ కావ్యాన్ని తెలుగువారికి పరిచయం చేసిన ముకుంద రామారావు ప్రయత్నం అభినందనీయం అని కొనియాడారు. ప్రపంచ కవిత్వాన్ని తెలుగు వారికి పరిచయం చేస్తున్న ఆయన అనువాద సృజనశీలి అని అన్నారు. భారతీయ కవుల్లో తాను అమితంగా అభిమానించే సీతాకాంత కలం నుంచి జాలువారిన కావ్యాన్ని అనువాదం చేసే సువర్ణావకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నై యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి మాడభూషి సంపత్కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.