రచయితల మహాసభల్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌
సమాజానికి దిక్సూచులు..కవులు, కళాకారులే: రమణ

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): పెన్షన్లు, సభలు తప్ప.. తెలంగాణ రచయితలు, కళాకారులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ రచయితల వేదిక మహాసభలలో భాగంగా ‘‘మేనిఫెస్టోలు - భాషా, సాంస్కృతిక రంగాలు - వివిధ పార్టీలు’’ అంశంపై జరిగిన ప్రత్యేక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేనిఫెస్టోలను చూసి ప్రజలు పార్టీలకు ఓటేస్తారని తాను భావించడం లేదన్నారు. పార్టీలు కూడా అంత సీరియ స్‌గా మేనిఫెస్టోలను రూపొందిస్తాయనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రచయితల సంఘం చొరవచూపి భాషా, సాంస్కృతిక రంగాలపై విభిన్న పార్టీల అభిప్రాయాన్ని అడగడం మంచి సంప్రదాయమని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌.. కళా, సాంస్కృతిక రంగాల పట్లా అలాగే వ్యవహరించిందని పేర్కొన్నారు. తెలంగాణ భాష పరిరక్షణపై అధ్యయనానికి నిపుణుల కమిటీ వేయాలని సూచించారు. తెలంగాణ మాండలికానికి సంబంధించిన పదాలతో సమగ్ర నిఘంటువును రూపొందించాల్సిన అవసరముందన్నారు. ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ విప్లవ కవి వరవరరావును అరెస్టుచేసినా టీఆర్‌ఎస్‌ నాయకులు పెదవి విప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నిద్రావస్థలోని సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులకు మాత్రమే ఉందని, వాళ్లు దిక్సూచులని టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. మహాకూటమి ఉమ్మడి ఎజెండాలో సాహిత్య, సాంస్కృతిక రంగాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు.