రవీంద్రభారతి,హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌సారు, విద్యాసాగర్‌రావు తమ ఉపన్యాసాల ద్వారా, తమ రచనల ద్వారా దేశంలోని మేధావి లోకాన్ని తెలంగాణ వైపు చూసేలా చేశారని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో నీళ్లలో నిప్పును రగిలించిన మేధావి విద్యాసాగర్‌రావు అని ఆయన అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వ ర్యంలో రవీంద్రభారతిలో జరుగుతున్న విద్యాసాగర్‌రావు స్మారక నాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం విద్యాసాగర్‌ రావు రచించిన... ‘ఆప్‌ కీ అదాలత్‌’, ‘గంధర్వులే తీరుస్తారు’, ‘ప్రధానం’ నాటకాలను ప్రదర్శించారు. దీంతో పాటు విద్యాసాగర్‌రావు రచించిన ‘విద్యాసాగర్‌రావు నాటకాలు, నాటికలు’ పుస్తకాన్ని మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ విద్యాసాగర్‌రావుతో ఉద్యమ సమయంలో సాన్నిహిత్యం పెరిగిందన్నారు.

నీళ్ల విషయంలో ప్రతి అంశాన్ని సాంకేతికంగా వివరించి ప్రజల్లో చైతన్యాన్ని తీసకొచ్చారన్నారు. ఆయన రాసిన కథనాలు, ఉపన్యాసాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని అన్నారు. సాగునీటి రంగంలో రాణం సస్యశామలం కావాలని విద్యాసాగర్‌రావు ఆకాంక్షించేవారని అన్నారు. త్వరలో జరిగే మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని ఓ సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెడతామని తెలిపారు. ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ యావత్తు తెలంగాణ బిడ్డలకు విద్యన్న దగ్గరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, శ్రీధర్‌రావు పాండే, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టీవీ నటుడు ప్రభాకర్‌ పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.