15-12-2017: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సీతాకాంత్‌ మహాపాత్రఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. కవిగా జ్ఞానపీఠ పురస్కారానికి పొందిన ఏకైక వ్యక్తి సీతాకాంత్‌ మహాపాత్ర. ఒరిస్సా సాహిత్యానికి అపురూపమైన సేవ చేసిన వ్యక్తిగా మాత్రమే కాకుండా నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఛైర్మన్‌గా, జ్ఞానపీఠ అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఆయన విశేషసేవలు అందించారు. ప్రపంచ తెలుగు మహాసభలలో విశేష పురస్కారాన్ని అందుకోవటానికి హైదరాబాద్‌కు విచ్చేసిన మహాపాత్రను ‘నవ్య’ పలకరించింది..తెలుగు సాహిత్యంతో మీకున్న అనుబంధాన్ని వివరిస్తారా?తెలుగు, ఒరియా భాషలకు.. సాహిత్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒరిస్సా సరిహద్దుల్లోని ప్రజలు చక్కని తెలుగు మాట్లాడతారు. నేను జ్ఞానపీఠ అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తొమ్మిది మందికి అవార్డులు ఇచ్చాం. వారిలో ఇద్దరు తెలుగువారు. ఒకరు సి. నారాయణరెడ్డి. మరొకరు రావూరి భరద్వాజ. ఇద్దరూ గొప్పవారే. నేను రాసిన ల్యాండ్‌స్కేప్‌ ఆఫ్‌ ఇండియన్‌ లిటరేచర్‌ అనే పుస్తకంలో భరద్వాజ గురించి ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసాన్ని ముకుంద రామారావు తెలుగులోకి అనువదించారు. అంతే కాదు. నేను తెలుగు రాష్ట్రాలకు అనేక సార్లు వచ్చాను. ఇక్కడ నాకు అనేక మంది సాహితీ మిత్రులున్నారు.ఒక అధికారిగా.. కవిగా.. రెండు పాత్రలు ఎలా నిర్వర్తించగలిగారు?నన్ను ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. సాధారణంగా అధికారి అంటే మిగిలిన ప్రజల కన్నా భిన్నమైన వ్యక్తిగా భావిస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. కవిగా రచనలు చేయటానికి సమయం అవసరం. సమయం ఉన్నవారం తా రాయగలరనేది నా ఉద్దేశం కాదు. (నవ్వులు). నేను నాలుగేళ్లు హోమిబాబా ఫెలోషి్‌పను తీసుకున్నా. దీని వల్ల నాకు చాలా సమయం చిక్కింది. ఇక రాయాలనే గాఢమైన కోరిక రాకుండా ఒక్క అక్షరం కూడా కాగితం మీద పెట్టలేదు. ఏదో ఒకటి రాయాలనే ఆలోచన సరికాదని నేను నమ్ముతాను.రాయాలనే కోరిక ఎలా కలుగుతుంది?ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అంతే కాదు. మన జీవిత లక్ష్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ అందరికీ ఉదయం అవుతుంది. అందరూ తమ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. వీటన్నింటితో పాటుగా సృజనాత్మకత ఉండాలి. అది హఠాత్తుగా వస్తుందని నేను అనుకోను. చాలా మంది తమకు ఫ్లాష్‌లా ఆలోచన వస్తుందంటారు. కానీ అది నిజం కాదు.