అట్టహాసంగా మువ్వా సాహితీ సంరంభం
సుద్దాల, దేవిప్రియలకు సాహితీ పురస్కారాలు

ఖమ్మం సాంస్కృతికం, మార్చి 23: ప్రముఖ సాహితీవేత్త, ఖమ్మం జిల్లాకు చెందిన మువ్వా శ్రీనివాసరావు రచించిన ‘వాక్యాంతం కవితా సంకలనం’ పుస్తకావిష్కరణ, మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్‌ సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం శనివారం నాడిక్కడ అట్టహాసంగా జరిగింది. రాజకీయ నాయకులు, సాహితీవేత్తల మధ్య ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత దేవీప్రియకు మువ్యా పద్మావతి, రంగయ్య సాహిత్య పురస్కారాలు, రూ.25 వేల నగదు అందించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. సమాజంలోని అంతర్గత భావాలను వ్యక్తం చేస్తున్న మువ్వా రచనలు మరో కోణం వైపు ఆలోచింప చేస్తున్నాయన్నారు. సమాజాన్ని చైతన్య పరిచేది రచనలేనని, సాహితీ ఉత్సవాలకు ఖమ్మం వేదికగా నిలవడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సాహితీ రంగంలో పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. మువ్వా శ్రీనివాస్‌ రచించిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కుప్పం విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి గంగిశెట్టి లక్ష్మీనారాయణ, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తదితరులు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల వారి ఇబ్బందులను, జీవిత క్రమాన్ని మువ్వా తన రచనల్లో తెలుపుతున్నారన్నారు. మువ్వా సాహిత్య అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
 
తెలుగు భాష ఔన్నత్యాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని, తెలుగు భాష ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. దేవీప్రియ మాట్లాడుతూ.. సాహిత్య రంగంలో తన ఉనికికి కారణమైన ప్రతి అడుగుకు రుణపడి ఉంటానని, తన బాల్యం ఆవేదన, ఆర్థ్రతల సమ్మేళనంగా గడిచిందన్నారు. తన రచనలకు వాక్యాంతం పుస్తక రచయిత మువ్వా శ్రీనివాసరావు స్ఫూర్తి కలిగించారన్నారు. సమాజం, మనుషుల మనోభావాలను తన హృదయంతో చూసి వాటినే రచనలుగా మలిచానన్నారు. కాగా, నవ స్వరాంజలి పేరిట మరో 9 మంది యువకవులకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, ఎమ్మెల్సీ పీ నాగేశ్వరరావు, పలువురు కవులు పాల్గొన్నారు. సుద్దాల అశోక్‌తేజ ఆలపించిన గీతాలు, ప్రియదర్శిని కళాశాల విద్యారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.