కవాడిగూడ, హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : సంప్రదాయ కవులు, ఆధునిక కవుల మధ్య సమన్వయం ఉండాలని డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. మంగళవారం దోమలగూడ ఏవీ కళాశాలలోని సెమినార్‌ హాల్లో ప్రముఖ రచయిత ఆచార్య రావికంటి వసుందన్‌ విశ్వనాథ రచించిన కవిత్వ కల్పతరువు విశ్వనాథ సాహితీ విమర్శనాగ్రంథంతోపాటు, సమ్మక్క-సారక్కల దేవతలపై రాసిన వనదేవతలు పునర్ముద్రణ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ కవుల సృజన అనంతమని, రావికంటి 101 పుస్తకాలను రచించిడం అభినందనీయమన్నారు. ఏవీ కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ కె.రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ రావికంటి సమాజానికి ప్రయోజనకరమైన సాహిత్యాన్ని రాస్తూనే ఉండాలన్నారు. ప్రముఖ రచయిత రావికంటి వసునందన్‌ మాట్లాడుతూ రామాయణంలో అహల్య ప్రస్తావనాంశాలను వివరించారు. సమ్మక్క సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లడం విశిష్టమైందని, అందుకే వనదేవతలు పుస్తకాన్ని పునర్ముద్రించినట్లు పేర్కొన్నారు. ఏవీ కళాశాల పీజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.యాదగిరిరెడ్డి మాట్లాడుతూ మనసుకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఆరంగంలో విశేష ప్రతిభను చూపాలని యువతకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి కవిత్వ కల్పతరువు - విశ్వనాథ గ్రంథాన్ని స్వీకరించారు. డాక్టర్‌ కె.రఘువీర్‌రెడ్డి వనదేవతలు గ్రంథాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లక్ష్మీవిజయ తదితరులు పాల్గొన్నారు.