ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌:‘దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్‌ మహోన్నత వ్యక్తిత్వం గల మనిషి. ఆయన నిర్మించిన చిత్రాలన్నీ గుర్తుంచుకోదగినవే. ‘దసరాబు ల్లోడు’తో దర్శకుడిగా మారిన ఆయనతో ఎఫ్‌ డీసీ ఛైర్మనగా పనిచేసినప్పటి నుంచి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అన్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ భగీరథ రచించిన ‘దసరాబుల్లోడు’ పుస్తకాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమకు విశిష్ఠ సేవలందించిన ఆయన చివరి రోజుల్లో ఫిల్మ్‌ నగర్‌ ధైవసన్నిధానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు’’ అని అన్నారు. ‘‘ఆయనతో మూడు దశాబ్దాల అనుబంధం నాది. 2004లో తొలి సారి విడుదల చేసిన ‘దసరాబుల్లోడు’ పుస్తకానికి కొనసాగింపుగా తాజా పుస్తకాన్ని అందిస్తున్నాను’’ అని భగీరథ అన్నారు. తెర మీద దసరాబుల్లోడు ఏఎన్నార్‌ అయితే వీబీ తెర వెనుక దసరా బుల్లోడని వీరశంకర్‌ కొని యాడారు. కార్యక్రమంలో రమేశప్రసాద్‌, సూర్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ వరదా చారి, శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు.