నారద జయంతి సభలో తెలంగాణ, హర్యానా ప్రభుత్వాల సలహాదారు వెంకట్‌ చంగవల్లి


హైదరాబాద్‌సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): పురాణాల్లో ధర్మరక్షణ, లోక కల్యాణం కోసం సమాచార రంగాన్ని వికసింపజేసిన దేవర్షి నారద మహర్షి పాత్రికేయులందరికీ రోల్‌మోడల్‌గా ఉన్నారని, నేటి పాత్రికేయులు సమాజానికి రోల్‌ మోడల్‌గా ఉండాలని తెలంగాణ, హర్యానా ప్రభుత్వాల సలహాదారు వెంకట్‌ చంగవల్లి అన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలు, అవినీతిని ప్రశ్నించే శక్తి ఒక్క పాత్రికేయులకే ఉందని చెప్పారు.  సమాచార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయగానసభలో దేవర్షి నారద జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకట్‌ చంగవల్లి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ కేరీర్‌లో ఎదిగేందుకు కొన్నిముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నివార్తలు రాశారనేదానికంటే ఎలా రాశారన్నదే ముఖ్యమన్నారు. పాఠకులను ఆకట్టుకునే విధంగా విశిష్టమైన వార్తలు రాయగలగాలన్నారు.  తన సంస్థ 108లో పనిచేసే సిబ్బందికి కూడా తాను ఇలాంటి అంశాలనే చెబుతుంటానన్నారు.   2007లో రాష్ట్రంలో ప్రారంభించిన 108 అంబులెన్స్‌ సేవలు విస్తరిస్తూ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌, హర్యానా వంటి రాష్ర్టాల్లోనూ విజయవంతంగా  కొనసాగుతున్నాయన్నారు. 

 

యూపీలో రూ. 2200 కోట్ల ప్రాజెక్టును ఏ విధమైన అవినీతిలేకుండా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడాన్ని అక్కడి ప్రభుత్వం అభినందించి ప్రభుత్వ సలహాదారుగా నియమించిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భారత్‌ ప్రకాశన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ సభ్యుడు ముఖే్‌షషా మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలోని ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టిలో పరిశీలించాలని అన్నారు. అలాగే ఒక వైద్యుడిగా ప్రజల నాడీని పరిశీలించాలన్నారు. పురాణాల్లో నారద మహర్షి ధర్మరక్షణ కోసం కృషి చేశారని, నేటి పాత్రికేయులు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా సమాచార భారతి అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నారదుడు మొట్టమొదటి కమ్యూనికేటర్‌గా చెప్పవచ్చన్నారు. సమాజానికి  మంచి చేసేందుకు, చెడుపై పోరాటానికి జర్నలిజం ఒక ఆయుధంగా మారిందన్నారు.  అందుకే ప్రతి సంవత్సరం నారద జయంతి సందర్భంగా జర్నలిజంలో విశేష సేవలు చేస్తున్న వారిని గుర్తించి వారిని సత్కరించాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో త్యాగరాయగానసభ అధ్యక్షుడు జనార్దనమూర్తి, ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ తిగుళ్ల కృష్ణమూర్తి, సమాచార భారతి ప్రతినిధులు ఆయు్‌షజీ, సురేందర్‌జీ, వేదుల నరిసింహం పాల్గొన్నారు. 

 
 
సీనియర్‌ పాత్రికేయులకు సన్మానం 
నారద జయంతి పురస్కరించుకుని సమాచార భారతి తెలంగాణ శాఖ జర్నలిజంలో విశిష్టసేవలు అందిస్తున్న పలువురు పాత్రికేయులను సన్మానించారు. ఈ సందర్భంగా వడ్లమూడి రామ్మోహన్‌రావు స్మారక అవార్డును సీనియర్‌ జర్నలిస్ట్‌, కృష్ణదేవయరాయ భాషానిలయం కార్యదర్శి టి. ఉడయవర్లుకు అందజేశారు. అలాగే సీనియర్‌ జర్నలిస్టు, కార్టూనిస్ట్‌ వడ్డి ఓం ప్రకాశ్‌నారాయణ్‌కు కూడా వడ్లమూడి రామ్మోహన్‌రావు స్మారక అవార్డును అందజేశారు. ఇక భండారు సదాశివరావు స్మారక అవార్డును సీనియర్‌ జర్నలిస్టు రావికంటి శ్రీనివాస్‌కు, సమాచార భారతి ఉజ్వల మహిళా పురస్కారాన్ని జర్నలిస్ట్‌ శుభ్రతా నిగంకు అందజేశారు.