న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం ఆయన తెలుగు భాషపై సమీక్ష నిర్వహించారు. మైసూరులోని భారతీయ భాషల కేంద్రంలో డైరెక్టర్‌ పదవి ఖాళీగా ఉందని, దాని నియామకానికి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏపీ, తెలంగాణలో కూడా అలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర యూనివర్సిటీల్లో ఉన్న విధంగా ఢిల్లీలోని జేఎన్‌యూలో కూడా తెలుగు భాషా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. నెల్లూరులో ఎన్‌సీఈఆర్‌టీ కేంద్ర నిర్మాణ పురోగతిపై కూడా కార్యదర్శితో సమీక్షించారు.