16-12-2017: జనజీవనం, రైతాంగ పోరాటం మొదలుకుని చివరకు వ్యవసాయ సంక్షోభం వరకు తెలంగాణకు, పంజాబ్‌కు ఎంతో సాన్నిహిత్యం వుంది. పంజాబ్‌లో గ్రామీణ మహిళలు సైతం వారి మాండలికంలో రచనలు చేస్తున్నారు. గ్రామీణ మహిళా చైతన్యమే మాతృభాషకు శ్వాస అవుతుందన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు పలు విశిష్ఠ పురస్కారాలు అందుకుని, 41 గ్రంథాలు రచించి, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పంజాబీ భాషా విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పంజాబీ కవయిత్రి, సాహితీ విమర్శకురాలు డాక్టర్‌ వనిత. ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా విచ్చేసిన ఆమె ‘నవ్య’తో ముచ్చటించారు.కవయిత్రిగా, తెలుగు గ్రంథాల అనువాదకురాలిగా, విద్యావేత్తగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల మీద మీ అభిప్రాయం?భాషోత్సవాలు మాతృభాషకు నిజమైన నీరాజనాలు. మాతృభాషా వికాసానికి అందరం కలిసికట్టుగా సంకల్పం చెప్పుకునే గొప్ప సందర్భం.

ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం చాలా గొప్ప విషయం. నిజానికి తెలుగు రాష్ట్రాలకు, పంజాబ్‌కు చాలా సారూప్యతలున్నాయి. తెలంగాణ జనజీవనానికి మా జనజీవనానికి మరింత సాన్నిహిత్యం వుంది. సుప్రసిద్ధ పంజాబీ కవి ప్యారాసింగ్‌ సెహరాయ్‌ 1948లో తెలంగాణ సాయుధ పోరాటం మీద చేసిన నృత్యరూపకం పంజాబ్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. ఉద్యమాలు, జీవనం, వ్యవసాయ సంక్షోభం విషయాల్లో కూడా తెలుగు ప్రజలు, పంజాబ్‌ ప్రజలు ఒక్కటే.దక్షిణాది భాషలతో మీకు చాలా కాలంగా అనుబంధం వున్నట్లుంది?దక్షిణాది భాషలు ముఖ్యంగా తెలుగు, కన్నడ భాషలంటే నాకు ఎంతో ఇష్టం. అందుకే డాక్టర్‌ గోపి కవితా సంకలనాన్ని అనువదించాను. కన్నడ, ఒరియాలోని మంచి కవితా సంకలనాలను అనువదించాను. దక్షిణ భారత భాషలు మధురం.

మాతృభాషను కాపాడుకునేందుకు ఈ ప్రాంత ప్రజలు మరింత చైతన్యవంతంగా కృషి చేయాలి.ప్రాంతీయ భాషలు సంకరం అయిపోతున్న తరుణంలో పంజాబీ భాష పరిస్థితి?ప్రపంచీకరణ ఫలితంగా అన్ని ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయి. భాష ఉద్యోగం ఇవ్వదు. డబ్బు సృష్టించదనే భావంతో యువత దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ మాతృభాషే మన ఉనికి అనే విషయం వారు విస్మరిస్తున్నారు. ఈ క్రమంలో మాండలికాలు బాగా దెబ్బతింటున్నాయి. పంజాబ్‌లో 8 మాండలికాలున్నాయి. గతంలో అన్ని మాండలికాల్లో రచనలు జరిగేవి. క్రమంగా అవి తగ్గుముఖం పడుతున్నాయి.