చిక్కడపల్లి, నవంబర్‌18(ఆంధ్రజ్యోతి): కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో యువ శాస్త్రీయ సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కిన్నెర 41వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 26వ తేదీవరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో నలభై మంది యువ సంగీత, నృత్య కళాకారులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొని ఉత్సవాలను హైదరాబాద్‌ బ్రదర్స్‌ రాఘవాచార్య- శేషాచార్య, హైదరాబాద్‌ సిస్టర్స్‌ లలిత- హరిప్రియ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు. డా కేవీ రమణాచారి, డా. అక్కినేని నాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు, టీటీడీ పాలకమండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు, మాజీ డీజీపీ, కిన్నెర అధ్యక్షుడు డా. ఆర్‌ ప్రభాకరరావు తదితరులు ప్రసంగించారు. యువ కళాకారులను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు.  ఈసందర్భంగా ఈమని పూర్ణిమ, బృందంచే ఫ్లూట్‌, వి సాత్వికచే గాత్ర కచేరీలు జరిగాయి.