హైదరాబాద్, రవీంద్రభారతి: సంస్కృత భాషను అధ్యయనం చేసి వ్యాకరణ నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రవ్వా శ్రీహరి నిఘంటువు నిర్మాణ పండితుడని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కొనియాడారు. నేటి తరానికి రవ్వా శ్రీహరి ఆదర్శమూర్తి అని చెప్పారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన రవ్వా శ్రీహరి పంచసప్తతి మహోత్సవం సందర్భంగా ‘శ్రీహరి విజయం’ శీర్షికన పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య రవ్వా శ్రీహరి రాసిన ‘‘శ్రీహరి విజయం’’ ‘‘పాణిని అష్టాధ్యాయి’’ ‘‘శ్రీహరి నిఘంటువు’’ పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆచార్య రవ్వా శ్రీహరి ప్రస్థానం గొప్పదని, తెలుగు శతకాలను సంస్కృతంలోకి చక్కగా అనువదించారని ప్రశంసించారు. సంస్కృతం ఎంత సరళంగా ఉంటుందో చెప్పిన ఘనత శ్రీహరిదేనని అన్నారు. శ్రీహరి బహుభాషావేత్తని, ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ కార్యక్రమానికి వచ్చానని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. ఇక, ఏడు నిఘంటువులు రాసిన వాళ్లు ఎవరూ లేరని, తెలుగు భాషకు మహా నిఘంటువు ఆయన నేతృత్వంలో రావాలని సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. చేనేత కుంటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి రవ్వా శ్రీహరి అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆ సందర్భంగా రవ్వా శ్రీహరి దంపతులను ఘనంగా సత్కరించారు.