చిలకలూరిపేట టౌన్‌,గుంటూరు: దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంతవరకూ ఎవరూ చేయని, సాహసించని ప్రయోగం అలగ్జాండర్‌ సాంఘిక నాటకం అని ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్‌ 1న చిలకలూరిపేట సీఆర్‌ క్లబ్‌ ఆవరణలో జేపీ థియేటర్‌ సమర్పణలో జయప్రకాష్‌రెడ్డి ఒక్కరే వంద నిముషాలపాటు అలగ్జాండర్‌ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా శనివారం క్లబ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయప్రకాష్‌రెడ్డి నాటకానికి సంబందించిన వివరాలు వెల్లడించారు. సినిమాలు లేకపోయినా బాధపడను కానీ మంచి నాటకం ఆడకపోతే ఎంతో బాధపడతానన్నారు. తనకు ఆప్తులైన సినీ నటులు కోట శ్రీనివాసరవు, అల్లరి నరేష్‌, రఘుబాబు, సుమ, ఝాన్సీ, కొండవలస, రావి కొండలరావు, తెలంగాణ శకుంతల తదితర సినీ ప్రముఖులు ఈ నాటకానికి గాత్రదానం చేసి సహకరించారన్నారు. ఇప్పటివరకు 55 ప్రదర్శనలు పూర్తి చేశానని, 100 ప్రదర్శనలు చేయాలన్నదే తన జీవిత లక్ష్యమన్నారు. సమావేశంలో సీఆర్‌ క్లబ్‌ సాంస్కృతిక విభాగం ఇన్‌చార్జి చెరుకూరి కాంతయ్య, కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు జక్కంపూడి శ్రీనివాసరావు, కోశాధికారి నన్నపనేని వెంకట్రామయ్య, గోరంట్ల నారాయణ పాల్గొన్నారు.