తెలంగాణ అంటేనే.. ధిక్కార స్వరం

‘కలాల స్వేచ్ఛ కోసం’లో వక్తల ఉద్ఘాటన
ప్రజల పక్షాన పోరాడుతాం: జయధీర్‌

పంజాగుట్ట/హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి):‘తెలంగాణ అంటేనే ధిక్కార స్వరం... అది రక్తం నుంచే వచ్చింది... తెలంగాణ రచయితల వేదిక (తెరవే)ను మూసుకుంటే మంచిదంటూ నందిని సిధారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం... పదవికి ఆయన రాజీనామా చేసి.. వెంటనే క్షమాపణ చెప్పాలి’’ అని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కలాల స్వేచ్ఛ కోసం’ అనే అంశంపై ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సదస్సు జరిగింది. ఇందులో 30 సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల్‌రావు మాట్లాడారు. 19 ఏళ్ల నుంచి అనేక అంశాలపై ప్రజల కోసం తమ వేదిక పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. తెరవేను మూసివేయాలంటూ సిధారెడ్డి వ్యాఖ్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆదివాసీలకు మద్దతుగా పని చేస్తున్నందుకే వేదికపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తెరవే అధ్యక్షుడిగా పని చేసిన సిధారెడ్డి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఓపీడీఆర్‌ నాయకుడు వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ అంటేనే ఒక ధిక్కార స్వరమని, అది తెలంగాణ రక్తంలోనే ఉందని రచయిత కాల్వ మల్లయ్య అన్నారు. ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ రచయితల వేదిక ప్రజల పక్షమే వహించిందని గుర్తు చేశారు.
 
కుల వర్ణ స్వభావాన్ని సిధారెడ్డి ఎప్పుడూ కోల్పోలేదని విమర్శించారు. స్వలాభం కోసం పాలకుల పక్షాన నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం రావాలని ఎస్‌జీటీయూ ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పాలకుల మెప్పు కోసం సిధారెడ్డి ప్రయత్నిస్తున్నారని సంఘటిత సాహిత్య వేదిక అధ్యక్షుడు వరప్రసాద్‌రావు ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తున్నారని, ఎవరైనా సాహసించి ప్రశ్నిస్తే తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేస్తున్నారని విమలక్క ఆరోపించారు. నందిని సిధారెడ్డి ఒక రకంగా అన్ని సంఘాలను ఏకం చేసి ఇక్కడ సమావేశం ఏర్పాటయ్యేలా చేశారని పీయూసీఎల్‌ నాయకురాలు జయ వింద్యాల అన్నారు. ప్రజల కష్టాలు తీర్చాలని పాలకవర్గాలు అనుకోవడం లేదని విరసం నాయకుడు అరవింద్‌ అభిప్రాయపడ్డారు.
 
టీఆర్‌ఎ్‌సను మూసేయాలంటే ఏం జవాబు ఇస్తారని తెలంగాణ జనసమితి ప్రతినిధి శ్రీశైల్‌రెడ్డి ప్రశ్నించారు. పదవిని రెన్యూవల్‌ చేసుకోవడం కోసమే సిధారెడ్డి ఇలా మాట్లాడుతున్నారని, ఇలాగైతే రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను ప్రజలు రెన్యూవల్‌ చేయబోరని స్పష్టం చేశారు. వేదిక ప్రధాన కార్యదర్శి నాగభూషణం, లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ మనోజ్ఞ, సుధాకర్‌, బంగారు విజయ, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.