సనత్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): స్నేహంపై వినోదాత్మక కథా ఆవిష్కరణకు సాక్షిభూతంగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని ల్యాండ్‌మార్క్‌ స్టోర్‌ నిలిచిందని సుప్రసిద్ధ రచయిత రవీందర్‌సింగ్‌ అన్నారు. ఆదివారం రచయిత రవీందర్‌సింగ్‌, సోమాజిగూడలోని ల్యాండ్‌మార్క్‌ స్టోర్‌లో తన అభిమానులను, పుస్తక ప్రియులను కలుసుకున్నారు. అనంతరం తాను రచించిన ద బిలేటెడ్‌ బ్యాచులర్‌ పార్టీ గురించి మాట్లాడుతూ మనస్ఫూర్తిగా నవ్వించేలా స్నేహంపై ఆకట్టుకునేలా ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు.స్నేహం ఎంతో విలువైందని, కొన్ని సమయాల్లో స్నేహం వేగవంతమైన ప్రయాణంతో కూడిన గగుర్పాటు కలిగించే రోలర్‌ కోస్టర్‌ సవారీలా అనిపించొచ్చు అని సింగ్‌ అన్నారు. తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన 12 సంవత్సరాల తర్వాత నలుగురు స్నేహితులు (ఇప్పుడు వారికి వివాహమైంది) తమలో ఎవరికి బ్యాచులర్‌ పార్టీ కాలేదని గుర్తిస్తారని, బ్యాచులర్‌ పార్టీకి ప్రణాళిక చేసుకొని యూర్‌పకు వెళతారని తెలిపారు. స్నేహం అని పిలువబడే చమత్కారయుక్తమైన సరదా ప్రయాణాన్ని ఆస్వాదించండి.. అని బ్యాచులర్‌ పార్టీ పుస్తకం గురించి వివరించారు.