రామానుజరావు కవిత్వంలో పల్లె సంస్కృతి 
దేవులపల్లి ప్రభాకరరావు 


పునర్నిర్మాణంలో రామానుజరావు కృషిని స్మరించుకోవాలి 
ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ 


ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌: తెలంగాణ తొలి తరం ఆధునిక వైతాళికుల్లో ముఖ్యులు డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు భాషా, సాంస్కృతిక, విద్యా రంగాల అభ్యున్నతికి ఎనలేని కృషిచేశారని ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకులు ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు కొని యాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం సమావేశ మందిరం వేదికగా మంగళవారం ఆంధ్ర సారస్వత పరిషత వ్యవస్థాపకులు, విద్యావేత్త దేవులపల్లి రామానుజరావు శతజయంతి సభ జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన రంగనాథాచార్యులు ప్రసంగిస్తూ జీవితకాలం విశాలాంధ్రవాదిగానే గాక, అందరి కన్నా ఎక్కువగా తెలంగాణ స్పృహను కలిగివున్న గొప్ప చైతన్యశీలి రామానుజరావు అంటూ వారి సేవల్ని ఉటంకించారు.
జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగావున్న సమయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ భాషాంతరీకరణతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించినవారిలో రామానుజరావు కీలకమైన వారని తెలిపారు. వారు అందించిన భాషా, సాంస్కృతిక, విద్యా ఫలాల్ని నేడు మనమంతా పరోక్షంగా అనుభవిస్తున్నా మన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ రామానుజరావు కవిత్వంలో తెలంగాణ పల్లె సంస్కృతి గుభాళిస్తుందని వర్ణించారు. తెలుగు సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా, ఓయూ సిండికేట్‌తోపాటు వైస్‌చాన్స్‌లర్‌గా వారందించిన సేవల్ని స్మరించుకున్నారు. ‘గోల్కొండ’ పత్రికలో పనిచేస్తూనే, నిజాం పాలనకు వ్యతిరేకంగా వరంగల్‌ నుంచి ‘శోభ’ పత్రికను నడిపిన బహుముఖ ప్రతిభాశాలి, సామ్యవాది రామానుజరావు అంటూ కీర్తించారు. 
 
ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆధునికత వైపు అడుగులువేస్తున్న ఓ సమాజానికి అవసరమైన మౌలిక సంస్థల నిర్మాణం ద్వారా దేవులపల్లి రామానుజరావు అందించిన కృషిని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ స్మరించు కోవాల్సిన అవసరముందని సూచించారు. రచయితకు బాహ్య ప్రపంచం నుంచి కావాల్సిన స్వేచ్ఛ గురించి మాట్లాడటమేగాక, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించే శక్తి వారికి ఉండాలని పదేపదే చెప్పేవారని గుర్తుచేశారు. విశాలాంధ్ర ఏర్పాటుకు చొరవ చూపిన ఆయనకి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తగిన గుర్తింపు దక్కలేదని కె.శ్రీనివాస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంతో మంది తెలుగు భాషావేత్తలు, బోధకుల్ని అందించడంతో పాటు, సాంస్కృతిక, రాజకీయ కేంద్రానికి నిలయమైన ఆంధ్ర సారస్వత పరిషత సంస్థను నెలకొల్పిన దేవులపల్లి రామానుజరావుకు తెలంగాణ సమాజం రుణపడుంటుందని శ్లాఘించారు. 
సభాధ్యక్షత వహించిన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య కె.సీతారామారావు మాట్లాడుతూ 1990లో గౌరవ డాక్టరేట్‌తో దేవులపల్లి రామానుజరావుని సత్కరించిన అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇప్పుడు వారి శతజయంతి స్మారక సభను నిర్వహించే అవకాశం లభించడం ముదావహమన్నారు. యూనివర్సిటీ రిజిసా్ట్రర్‌ సి.వెంకటయ్య, అకడమిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.వి.రాజశేఖరరెడ్డి, తెలుగు విభాగాధిపతి ఎన్‌.రజని, దేవులపల్లి రామానుజ రావు కుటుంబసభ్యులు తదితరులు సభలో పాల్గొన్నారు.