ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: కాకతీయ నృత్యంపై ఎంతమంది ఎన్ని విధాలుగా ఆరోపణలు చేసినా దాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్తానని శాస్త్రీయ నృత్య కళాకారిణి పద్మజారెడ్డి అన్నారు. కాకతీయ నృత్యం కోసం ఎంతగానో శ్రమించానని చెప్పిన ఆమె.. కూచిపూడి ఉండగా కాకతీయం ఎందుకని కొంతమంది ప్రశ్నించటం సరికాదన్నారు. కాకతీయుల కాలంలో జయాపసేనాని రచించిన నృత్యరత్నావళిని ఆధారం చేసుకొని నృత్యరూపకంగా మలిచినట్లు తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజానీకం ఎంతగానో హర్షిస్తుండగా కొందరు మాత్రం అక్కసుతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తను చేసిన నృత్యం నృత్యరత్నావళి అవునా కాదా అనే విషయం ప్రజలు, పరిశోధకులు, ప్రభుత్వం తేల్చి చెబుతుందని చెప్పిన పద్మజారెడ్డి... తన ప్రయత్నం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పునరుద్ధీకరణ క్రమంలో వెలుగు దివ్వెలా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక కొత్త నృత్యం వచ్చినంత మాత్రాన ఇప్పటి వరకు ఉన్న కళారూపాలకు ఎలాంటి సమస్య ఉండబోదని, దేని ప్రాధాన్యం దానికి ఎప్పుడూ ఉంటుందని అభిప్రాయపడ్డారు. తన కాకతీయ నృత్యంపై తెలంగాణ ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలను తప్పకుండా స్వీకరిస్తానని, అయితే విషప్రచారం చేసే వారికి తన నృత్యమే సమాధానం చెబుతుందన్నారు.