ఘనంగా ప్రారంభమైన భారత్‌ రంగ్‌ మహోత్సవ్‌ 

హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ప్రపంచానికి గొప్ప నటులను అందించిందని, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా బ్రాంచీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని నిజామాబాద్‌ ఎంపీ కవిత తెలిపారు. తెలంగాణ వచ్చాక కళలు, సంస్కృతి వర్థిల్లుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా భారత్‌ రంగ్‌ మహోత్సవ్‌ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ కవిత జ్యోతి ప్రజ్వలన చేసి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ నాటక రంగాన్ని విశ్వవాప్తం చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కళలది పెద్దపాత్ర అని ఆమె గర్తుచేశారు. హైదరాబాద్‌ నుంచి కూడా గొప్ప నటులను ఎన్‌ఎస్‌డీ ద్వారా అందించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కళలను అభిమానించే వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే ఇక్కడి కళలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ప్రొఫెసర్‌ సురేష్‌ భరద్వాజ్‌, సురభి నాగేశ్వర్‌రావు, బసవలింగయ్య, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. 


ఆలోచింపజేసిన ‘లవ్‌ యువర్‌ నేచర్‌’ 
ఎన్‌ఎస్‌డీ భారత్‌ రంగ్‌ మహోత్సవంలో తొలి ప్రదర్శనగా ఇంపాల్‌కు చెందిన కెంగిల్లి మైమ్‌ థియేటరీ రిపార్టరీ వారితో లవ్‌ యువర్‌ నేచర్‌ నాటకాన్ని ప్రదర్శించారు. ప్రకృతి సమతుల్యతని పాటిస్తేనే సమస్త జీవరాశులు మనుగడను సాధిస్తాయనే నేపథ్యాన్ని పంచారు. నటీనటులు అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. ముఖాభినయంతో కూడిన ఈ నాటకం నగర ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఈ నాటకానికి సదానందసింగ్‌ దర్శకత్వం వహించారు.