మాదాపూర్‌,హైదరాబాద్: శంకరాభరణం సినిమాతో తనను నటిగా పరిచయం చేసిన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు గురుదక్షిణగా నటి తులసి ‘శంకరాభరణం’ పేరుతో ప్రత్యేకంగా ఏటా అవార్డులు అందజేయను న్నారు. దీనిలో భాగంగా మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మంగళవారం 2017 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె.విశ్వనాథ్‌తో పాటు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి హాజరై అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ను ఘనంగా సన్మానించారు. ఉత్తమ దర్శకుడిగా కొరటాల శివ (జనతా గ్యారేజ్‌), ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ (జనతా గ్యారేజ్‌), ఉత్తమ నటిగా రెజీనా (జ్యో అచ్యుతానంద), తొలి చిత్ర దర్శకుడిగా ధనుష్‌(తమిళ్‌), ఉత్తమ దర్శకుడిగా ఆనంద్‌ (తమిళ్‌), ఉత్తమ గాయనిగా గీతా మాధురి (జనతా గ్యారేజ్‌), ఉత్తమ హాస్యనటుడు ప్రియదర్శి (పెళ్లి చూపులు) ఎంపికయ్యారు. ఎస్పీ శైలజకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఉత్తమ చిత్రంగా శతమానం భవతి ఎంపికైంది. అనంతరం గాయని, గాయకులు కృష్ణ, గీతామాధురి, సాకేత్‌, రఘురాం, పర్వికా, రమ్య అలపించిన పాటలు సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్‌, అన్నపూర్ణ, శివాజీ, అలనాటి నటీమణులు పాల్గొన్నారు.