భీమవరంలో ముగిసిన జాతీయస్థాయి నాటక పోటీలు 
దిష్టిబొమ్మలు నాటకానికి ప్రథమస్థానం 

భీమవరం,పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో మూడు రోజులగా కళారంజని నాటక అకాడమి వారి అధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు ముగిశాయి. తెలుగు నాటక రంగ దినోత్సవం పురస్కరించుకుని భీమవరంలో దివంగత యిర్రింగి గంగారామ్‌ కళా ప్రాంగణం, మునిసిపల్‌ ఓపెన్‌ ఎయిర్‌ ఽథియేటర్‌, పీఎస్‌ఎం బాలికల పాఠశాలలో జరిగిన జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు జనరంజకంగా జరిగాయి. మూడు రోజుల పాటు మొత్తం ఏడు నాటికలు ప్రదర్శించగా వాటిలో దిష్టిబొమ్మలు నాటకం ప్రథమ బహమతి సాధించింది . ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా మళ్ళీ మొదలు పెట్టకండి, తృతీయ బహుమతి మధురస్వప్నం నాటికలు బహుమతులు పొందాయి. జ్యూరీ ప్రదర్శనగా ఉయ్యాల నాటిక ఎంపికైంది.
 
మొదటి బహుమతి: దిష్టిబొమ్మలు 
వృద్ధ్దాప్యంలో ఉన్న తల్లి తండ్రులను అనాధలుగా వదిలేయకుండా కంటికి రెప్పలా కాపాడాలనే ఇతి వృత్తంతో సాగిన ఈ నాటిక మొదటి బహుమతి సాధించింది. కన్నబిడ్డలు వృద్ధాప్యంలో తల్లితండ్రుల్ని కావడిలో స్వయంగా మోసి, తీర్ధయాత్రలకు తిప్పి, మోక్షాన్ని ప్రసాదించిన శ్రవణకుమారులు కావాలే కానీ.... మానవీయ విలువలను శిథిలం చేస్తూ కన్న తల్లితండ్రుల పేగుబంధాన్ని తెంచేసుకుంటూ, ఎందుకూ పనికిరాని దిష్టిబొమ్మలుగా మిగిలిపోకూడదనే సందేశంతో ఈ నాటకం సాగింది.
 
రెండవ బహుమతి: మళ్ళీ మొదలు పెట్టకండి 
కెజెఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ సికింద్రాబాద్‌ వారి మళ్ళీ మొదలు పెట్టకండి నాటిక రెండవ బహుమతి పొందింది. ప్రపంచంలో 20 శాతం ధనాన్ని 80 శాతం మంది పంచుకుంటున్నారు.. 80 శాతం ధనాన్ని 20 శాతం మంది అనుభవిస్తున్నారు. కొంతమందైనా సంపాదనలో కొంత సమాజం కోసం ఖర్చు పెడితే అసలు ఆకలి అన్న పదమే సమాజంలో వినబడదు అనే ఇతివృత్తం కఽథాంశంగా సాగింది. రచయిత, దర్శకత్వం ఉదయ్‌ భాగవతుల వ్యవహరించారు. నటీనటులు కేజేఆర్‌ (జోగారావు), శ్రీజ సాదినేని, ఉమాశంకర్‌ సురభి, కలమిత్ర ఆకాడమి శంకరరావు, పుట్టా ఆనంద్‌లు.
 
ముడవ బహుమతి: మధురస్వప్నం 
గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక వెనిగండ్ల వారి మధురస్వప్నం నాటిక ప్రముఖుల ప్రశంసలతో పాటు జాతీయస్థాయి నాటిక పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది. భారతీయులందరు అన్నదమ్ముల్లా జీవిస్తు భరతంఖండాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన రోజే తమ పరిపూర్ణమైన మధురస్వప్నం నెరవేరుతుందని, ముందుతరాలకు తెలియచేయడం కోసం ఒక స్వాతంత్య్ర సమరయోధుడు రాసిన డైరీని ఒక అవినితి పరుడైన అధికారి చదివి నిజాయితీ పరుడిగా మార తాడు. ప్రాణాలకు తెగించి అవినీతి రహిత భారతం కోసం గాంధేయ మార్గంలో పోరాటానికి సిద్ధమైౖ ప్రతిజ్ఞ చేయడమే ఈ నాటిక సారాంశం. 

సినీ, టీవీ, రంగస్థల నటుడు జవ్వాది నాగేశ్వరరావుకు పురస్కారం 
ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటుడు పులఖండం నాగేశ్వరరావు కళావాది జవ్వాది సూర్యారావు స్మారక పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్సీ బొమ్మిడి నారాయణరావు, జీవీఐటీ విద్యా సంస్థల అధినేత గ్రంది వెంకట్రవు, మానేపల్లి పేరయ్య వంటి ప్రముఖులు చేతులు మీదుగా కళారంజని వారు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును పూలమాలలు, దుశ్శాలువతో సత్కరించారు. 


ఉత్తమ దర్శకుడిగా ఉదయ్‌... 
ఉత్తమ దర్శకుడిగా ఉదయ్‌ భాగవతులు, ఉత్తమ రచయితగా తాళాబత్తుల వెంకటేశ్వరరావులు ఎంపికయ్యారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా తిరుమల కామేశ్వరరావు, ఘంటా రామ్మోహన్‌రావు, కె.సత్యప్రసాద్‌లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చుక్కనశ్రీ, వ్యవస్థాక అధ్యక్షుడు జవ్వాది దాశరధీ శ్రీనివాస్‌, గుండా రామకృష్ణ, మెంటే పూర్ణ చంద్రరావు, పోశింశెట్టి మురళి, లక్ష్మికాంత, మాదాసు కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.