చిక్కడపల్లి(హైదరాబాద్), ఆగస్టు 15: వానమామలై వరదాచారి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని వక్తలు పేర్కొన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గానసభలో ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచారి జయంతి సభ జరిగింది. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలుగు సాహిత్యంలో అనేక రచనలు సరళసుందరంగా చేసినవారు వరదాచారి అన్నారు. ఆయన రాసిన పోతన చరిత్ర రచన తెలుగులో అత్యంత ప్రామాణికమైన గ్రంథమన్నారు. ఆయన అభినవ పోతనగా కీర్తించబడ్డారన్నారు. కార్యక్రమంలో అర్చన వెంకటేశ్వరరావు, సుజాతారమణమూర్తి, బండి శ్రీనివాస్‌, యలవర్తి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.