హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: అట్టడుగు వర్గంలో నుంచి అజేయమైన కవిగా వరకవి సిద్ధప్ప పేరొందారని బీసీ కమిషన్‌ చైర్మన్‌ బి.ఎస్‌.రాములు అన్నారు. సిద్ధప్ప చరిత్రపై సెమినార్లు పెట్టాలన్నారు. శనివారం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో వరకవి సిద్ధప్ప తత్వ కవిత పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఎస్‌.రాములు ప్రజాగాయకుడు గద్దర్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, అందెశ్రీ, బి.నర్సింగరావు, నందిని సిధారెడ్డిలతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సోమిడి జగన్‌రెడ్డి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.ఎస్‌.రాములు మాట్లాడుతూ వరకవి సిద్ధప్ప గొప్ప సాహితీవేత్త అని అన్నారు.

గద్దర్‌ మాట్లాడుతూ తెలంగాణ కవుల చరిత్రను రికార్డ్‌ చేయాలని అన్నారు. కోట్లాది ప్రజలను కదిలించిన తనపై ఏ ఒక్కరూ పుస్తకం రాసే సాహసం చేయడం లేదని అన్నారు. వరకవి సిద్ధప్ప భజనమండలిని ఉపయెగించుకుని రచనలు చేశారని అన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ దక్కనీ సంస్కృతి మూలాలు వెలికి తీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మన మూలాలను తెలియజేసే పుస్తకం ఇదని అన్నారు. బి.నర్సింగరావు మాట్లాడుతూ ఆలోచింపజేస్తే పుస్తకమని అన్నారు. సిద్ధప్పతో పాటు చాలామంది తత్వకవులు ఉన్నారని వారందరి చరిత్రను బయటితీయాలని అన్నారు. సభాధ్యక్షత వహించిన నందినిసిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ భజనమండలి ఎన్నో ఉద్యమాలకు వేదికైందన్నారు. వరకవి సిద్ధప్ప గొప్ప కవి అని కొనియాడారు. అందెశ్రీ మాట్లాడుతూ తనకు కవితభిక్ష పెట్టిన మహాకవి సిద్ధప్ప అని తెలిపారు. భన్సీలాల్‌పేట భజనమండలి అచలతత్వానికి వేదికైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధప్ప కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు పాల్గొన్నారు.