‘నాటకం’ అంటే అదేమిటని ఆశ్చర్యపోతూ ప్రశ్నించే తరం వచ్చేస్తున్న కాలంలో... ‘ఆఁ! ఎవరు చూస్తారులే!’ అని పెద్దలు కూడా పెదవి విరిచే రోజుల్లో... రంగస్థలానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనీ, కళలకు పట్టం కట్టాలనీ తపిస్తోంది వరంగల్‌ గ్రామీణ జిల్లా వర్థన్నపేటకు చెందిన భారతీయ నాటక కళా సమితి. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి పదమూడు వరకూ వార్షికోత్సవాలను జరుపుకొంటున్న ఈ సంస్థకు దాదాపు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర సొంతం. సంస్థ చేస్తున్న కృషి గురించి సమితి ప్రధాన కార్యదర్శి ఈగ సాంబయ్య మాటల్లోనే...

వినోదం ఫోన్ల రూపంలో అర చేతుల్లోకి వచ్చేసి... ప్రదర్శన కళారూపాల ఉనికి ప్రశ్నార్థకమైపోతున్న తరుణంలో నలభై నాలుగేళ్ళుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటోంది మా భారతీయ నాటక కళా సమితి. నాటక రంగానికి పటిష్టమైన వేదిక కల్పించడంతోపాటు మానవీయ విలువలకు పట్టం కట్టాలనే ఆశయంతో 1974లో మా నాన్నగారు ఈగ శ్రీహరి ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. దేశభక్తినీ, జాతీయ సమగ్రతనూ ప్రోత్సహించడం కూడా మా ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. కాలానుగుణంగా మారుతూ, ఎన్నో ఒడుదొడుకులను తట్టుకొని, ఆశయాల నుంచి పక్కకు జారిపోకుండా తన సాంస్కృతిక మూలాలను మా సంస్థ నిలబెట్టుకుంటోంది.
 
విరాళాలతోనే నడుపుతున్నాం!
గ్రామీణ తెలంగాణలో సొంత ఆడిటోరియం, బహిరంగ వేదిక, సౌండ్‌, లైట్‌ పరికరాల లాంటివన్నీ ఉన్న అతికొద్ది గ్రామీణ నాటక బృందాల్లో మాదీ ఒకటి. నాటకాన్ని ఒక కళారూపంగా పరిరక్షించడం, రాబోయే తరాల్ని ప్రోత్సహించడానికి నాటక పోటీలు నిర్వహించడం, కోలాటం, భజన, హరికథల్లాంటి ప్రాచీన కళారూపాల్ని కాపాడడం, ఔత్సాహికులకూ, విద్యార్థులకూ శిక్షణ శిబిరాలు, వర్క్‌షాపులూ నిర్వహించడం, నాటక దర్శకత్వం, సంగీతం, మేకప్‌ తదితర అంశాల్లో వర్క్‌షాపులు కండక్ట్‌ చెయ్యడం, నాటకాలపై వచ్చిన పుస్తకాలు, ఆడియో, వీడియోలతో గ్రంథాలయ నిర్వహణ, ప్రాచీన కళారూపాలపై పుస్తక ప్రచురణ... ఇవి మా లక్ష్యాల్లో కొన్ని. మా సంస్థకు రాజకీయపరమైన ఎలాంటి సంబంధాలూ లేవు. మేము చిన్నచిన్న విరాళాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాం.
 
ఎందరో మహానుభావుల ప్రశంసలు
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం, రంప పితూరీలో అల్లూరి పాత్రపై ప్రదర్శించిన నాటకం మా సమితికి బాగా పేరు తెచ్చినవాటిలో ఒకటి. తెలుగు సినీ, నాటక రంగాలకు, ఇతర రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు మా నాటకాలను చూసి ప్రశంసలు అందించారు. వారిలో జమున, జె.వి.సోమయాజులు, కోట శ్రీనివాసరావు, దేవదాస్‌ కనకాల, సుత్తివేలు, బాబూమోహన్‌, ఆర్‌.పి. పట్నాయక్‌, పొత్తూరి వెంకటేశ్వరరావు, అల్లూరి నారాయణరావు తదితరులున్నారు.
 
పరిష్కారాలూ కూడా చూపిస్తాం!
సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని మా సమితి తరఫున ప్రదర్శించే నాటకాల్లో ప్రధానంగా చెబుతాం. అయితే కేవలం సమస్యలను ప్రస్తావించి వదిలెయ్యకుండా పరిష్కారాలు కూడా చూపిస్తాం. అందుకే మా జిల్లాలోని ప్రేక్షకులందరూ మా నాటకాల్ని ఇంత కాలంగా ఆదరిస్తున్నారు. సామాజిక, రాజకీయ, ఆరోగ్య, నైతిక సంబంధమైన సమస్యలూ, వాటి పరిష్కారాలతో ఆడియోలూ, వీడి యోలూ రూపొందించాలనుకుంటున్నాం. ఇక, ఈ ఏడాది వార్షికోత్సవాల సందర్భంగా రోజూ రెండు నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ నాటకాల్లో మహిళల హక్కులు, స్వచ్ఛ భారత్‌, కుటుంబ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, వ్యక్తిత్వ వికాసం, వ్యవసాయ సంక్షోభం, గ్రామాలనుంచి పట్టణాలకు వలస ప్రధాన అంశాలుగా ఉంటాయి.