సారస్వత పరిషత్‌ ఏర్పడి 75 వసంతాలు

తెలుగుకు మహోదయం.. కళా సంస్కృతుల సమ్మేళనం

హైదరాబాద్‌ సిటీ, మే 25: నిజాం ప్రభువుల ఏలుబడిలో కొడిగట్టిన దీపంలా మారిన తెలుగు భాష కొత్త కాంతులీనే ఆరని జ్యోతిగా మార్చిన సారస్వత పరిషత్‌ ఇపుడు తెలంగాణ నడిబొడ్డున సగర్వంగా సమున్నతంగా భాసిస్తోంది. 75 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ స్వాతి చినుకులా మొదలై క్రమేణా వానై వరదై పరవళ్లు తొక్కి చివరకు ఓ మహాసాగరంలా నిలిచిందీ భాషా కేంద్రం. మూడుతరాల సాహితీవేత్తలకు సారస్వత పరిషత్‌ ఓ భాషా విడిది. అద్భుతమైన సాహిత్యం ఇక్కడ పురుడు పోసుకుంది. వేనవేల పండితుల్ని, భాషా శాస్త్రవేత్తల్ని, అఽధ్యయనశీలుర్ని, భాషాభిమానుల్ని తీర్చిదిద్దిన ఈ కేంద్రం ఇప్పటికీ తెలుగు భాషామ తల్లికి పుట్టినిల్లుగా భావించేరీతిలో నిలిచింది. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల పునరుజ్జీవం కోసం ప్రభవించిన ఈ సంస్థ ఏర్పడి శనివారానికి 75 ఏళ్లు. ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మల్చాలని పరిషత్‌ కార్యవర్గం నిర్ణయించింది. శనివారం నుంచి 4 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రారంభ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారు.

రోజూ ప్రత్యేక చర్చలు, కవి సమ్మేళనాలు, భాషా వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగాలు, సారస్వత పరిషత్‌ను బలోపేతం చేసే చర్యలపై సూచనలు ఉంటాయని పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి చెప్పారు. తెలుగు భాషా వైభవ పునరుజ్జీవంలో పరిషత్‌ది ఒక విశిష్ట స్థానం. తెలుగును బతికించాలన్న ఏకైక కాంక్షతో కొందరు భాషాభిమానులు దీనికి ప్రాణం పోశారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయం వేదిక. శ్రీలోకనంది శంకరనారాయణరావు ఆనాటి సభకు అధ్యక్షత వ హించారు. బూర్గుల రంగనాథరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు, నందగిరి వెంకటరావు, చిదిరెమఠం వీరభద్రశర్మ, కోదాటి నారాయణరావు, గడియారం రామకృష్ణశర్మ తదితరులు కార్యవర్గ సభ్యులుగా 1943, మే 26న తెలుగు భాషా వికాసం కోసమై ‘‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’’ ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆంక్షలకు గురై తరువాత ఆంధ్ర పరిషత్‌ అయింది. ప్రారంభంలో గోల్కొండ పత్రిక కార్యాలయంలోనే పరిషత్తు కూడా ఉండేది. అనంతరం ఈ పరిషత్‌ కార్యాలయాన్ని బొగ్గులకుంటకు మార్చారు. బూర్గుల రామకృష్ణారావు, కాళోజీ నారాయణరావు, అడవి బాపిరాజు, పీవీ నరసింహారావు తదితరులు పరిషత్తు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు తెలుగు వికాసోద్యమానికి కృషి చేశారు. 1971లో ట్రస్ట్‌ ఏర్పాటైంది. పరిషత్‌కు స్థలం సమకూర్చేందుకు బెజవాడ గోపాలకృష్ణరెడ్డి, కొండ వెంకటరంగారెడ్డి సహకారం అందించారు.

ఈ పరిషత్తుకు దశ దిశ ఏర్పరిచిన వారు దేవులపల్లి రామానుజరావు. ఆయన స్ఫూర్తిమంతమైన నేతృత్వంలో భాషా కుసుమం విరబూసి గుబాళించింది. ఆ త ర్వాత జ్ఞానీపీఠ పురస్కార గ్ర హీత సి.నారాయణరెడ్డి సారథ్యంలో మరింత గౌరవం పొందింది. భాషా సంస్కృతులు పరిఢవిల్లడానికి దోహదం చేసిన ఈ కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ సారస్వత పరిషత్‌గా మారి తెలంగాణలో భాషా వికాసానికి దిక్సూచిగా మారింది.