‘ఆంధ్రజ్యోతి’ జర్నలిస్టు కృష్ణారావుకు అనువాద పురస్కారం ప్రదానం

న్యూఢిల్లీ, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ అసోసియేట్‌ ఎడిటర్‌ ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం అగర్తలాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబారా ఆయనకు జ్ఞాపికతోపాటు రూ.50వేల నగదు అందజేశారు. ప్రముఖ డోగ్రీ రచయిత్రి పద్మా సచిదేవ రచించిన కవితలను ‘‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’’ పేరిట తెలుగులోకి అనువదించినందుకు కృష్ణారావుకు అనువాద పురస్కారం లభించింది. డోగ్రీ భాషలో పద్మ రచించిన ఈ కవితలను కాంగ్రెస్‌ నేత కరణ్‌సింగ్‌తోపాటు ఇతర ప్రముఖులు ఇంగ్లిషులోకి అనువదించగా, వాటిని కృష్ణారావు తెలుగులోకి తర్జుమా చేశారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌, కార్యదర్శి కె. శ్రీనివాసరావు, హిందీ రచయిత గోవింద్‌ మిశ్రా, తెలుగు కవి వాడ్రేవు చినవీరభద్రుడు పలువురు రచయితలు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో జన్మించిన కృష్ణారావు మూడు దశాబ్దాలకుపైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ‘ఇండియా గేట్‌’, ‘నడుస్తున్న హీనచరిత్ర’ పేరిట రెండు పుస్తకాలను రచించారు. ‘‘ఆకాశం కోల్పోయిన పక్షి’’తో పాటు మరో రెండు కవితా సంపుటాలను వెలువరించారు. సాహితీ, జర్నలిజం రంగాలకు చేసిన సేవలకుగానూ మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు, ఎన్‌ఆర్‌ చందూర్‌ అవార్డు, తాపీ ధర్మారావు అవార్డు, అలూరి బైరాగి పురస్కారాలను ఆయన అందుకున్నారు.