చిక్కడపల్లి, డిసెంబర్‌15(ఆంధ్రజ్యోతి): శ్రీ సచ్చిదానందకళాపీఠం ఆధ్వర్యంలో శనివారం రాత్రి త్యాగరాయగానసభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన ప్రముఖ కవి, రచయిత పద్మశ్రీ డా. కొలకలూరి ఇనాక్‌ను  ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా పా ల్గొన్న తెలంగాణ సాహిత్యఅకాడమీ అధ్యక్షుడు డా.  నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడో ఇరవై ఏళ్లనాడు రావాల్సిన పురస్కారం ఇప్పటికైనా ఇనాక్‌కు  రావడం హర్షణీయమన్నారు. తాను పోటీ పడ్డా కూడా ఆయనకు రావడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యంలో ప్రతిభకు రావాల్సిన ఫలితం దక్కిందన్నారు. తన జీవితాన్ని కూడా సాహిత్యంగా మలిచిన వ్యక్తి ఇనాక్‌ అన్నారు. కార్యక్రమంలో కళా జనార్దనమూర్తి, పొత్తూరు సుబ్బారావు,డా. గౌరీశంకర్‌, సాధన నరసింహాచార్య తదితరులు పాల్గొన్నారు. 

ఘనంగా నృత్యోత్సవ పురస్కారం
నటరాజ్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో నృత్యోత్సవ పురస్కార ప్రదానం -2018 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎ. విజయకుమార్‌కు శిబి కీర్తి కిరీటి బిరుదును ప్రదానం చేసి సన్మానించారు. జస్టిస్‌ జి ,చంద్రయ్య అధ్యక్షతన  జరిగిన సభలో మాజీ గవర్నర్‌ కె.రోశయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. సాహితీ, సాంస్కృతిక సంస్థలను ప్రోత్సహిస్తున్న విజయకుమార్‌ను బిరుదుతో సన్మానించడం సముచితంగా ఉందన్నారు. డా. వకుళాభరణం కృష్ణమోహనరావు తదితరులు పాల్గొన్నారు.