కూలీ నోట.. కమ్మని పాట!

ఆమె గాత్రానికి ఫేస్‌బుక్‌లో 13లక్షల లైక్‌లు

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి నుంచి ఆహ్వానం

ఈమె పేరు పసల బేబీ.. చదువు లేకపోయినా చక్కని గాత్రం ఈమె సొంతం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు ఎస్సీ కాలనీలో నివసిస్తున్నబేబీకి చిన్నప్పటి నుంచి పాటలంటే చాలాఇష్టం. సినిమా పాటలు వింటూ వాటిని పాడటం సాధన చేసింది. గొంతు బాగుండటంతో చర్చిలోను, ఇతర కార్యక్రమాల్లోనూ ఆమెతో పాడించేవారు. వ్యవసాయ పనులకు వెళ్తే అక్కడి కూలీలకు శ్రమ తెలియకుండా పాటలు పాడి వారిని ఉత్సాహపరుస్తుంది. కొద్దికాలంగా జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనికి వెళుతోంది. పొరుగింట్లో నివసించే రాణి అనే మహిళ బేబీ పాటను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దానికి 13లక్షల లైక్‌లు రావడంతో ఒక్కసారిగా ఈమె పేరు మార్మోగింది. ఆ పాటవిన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి తనకు అవకాశం ఇస్తానన్నారంటూ బేబీ ఆనందంగా చెబుతోంది. ‘బోల్‌ బేబీ బోల్‌’ కార్యక్రమంలో బేబీతో పాడిస్తారని తెలిసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- రంగంపేట