గుంటూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 9: అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని తాను అందుకోవడం ఆనందదాయకమని ప్రముఖ సినీనటి జమున అన్నారు. డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు కళాపరిషత్‌ ఆధ్వర్యంలో గుంటూరులో సోమవారం జరిగిన కార్యక్రమంలో జమునకు అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని ప్రదానం చేశారు. సభకు కళాపరిషత్‌ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీత జమున మాట్లాడుతూ తాను పుట్టిన గుంటూరు జిల్లాలో అవార్డు అందుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ డాక్టర్‌ కొలకలూరి ఇనాక్‌ తదితరులు జమునను వెండి కిరీటం, శాలువా, గజమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.