చిక్కడపల్లి, సెప్టెంబర్‌25(ఆంధ్రజ్యోతి): జీవీఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డా. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా జీవీఆర్‌ ఆరాధన- డాక్టర్‌ అక్కినేని కళావిశిష్ట పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఆ సంస్థ అధినేత గుదిబండి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో ఘనంగా జరిగింది. వివిధ రంగాల ప్రముఖులు డా. కాచం సత్యనారాయణగుప్తా, మహ్మద్‌ రఫీ, డా.కొత్త కృష్ణవేణి, వీఎ‌స్‌వీ ప్రసాద్‌లకు పురస్కారాలను శాసనమండలి మాజీ చైర్మన్‌ డా. ఎ చక్రపాణి ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగేశ్వరరావు తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు అన్నారు. సమాచార హక్కుచట్టం పూర్వ కమిషనర్‌ పి. విజయబాబు, అర్చన ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ప్రతినిధి జయంత్‌, సి,. రామకృష్ణ, రాజశేఖరరెడ్డి, రామరాజు శ్రీనివాసరావు, జయప్రకాశ్‌రెడ్డి, మంజుల పాల్గొన్నారు. 

అక్కినేనివి ఆణిముత్యాలాంటి సినిమాలు

అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలను నేటికీ తెలుగువారు మరువరని అంతటి గొప్ప చిత్రాలు వారి కలయికలో వచ్చాయని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, గిఫ్ట్‌, గానసభల ఆధ్వర్యంలో  అక్కినేని నాగేశ్వరరావు చలనచిత్ర వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్ధా మురళి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అనేక సినిమాలు ఆణిముత్యాలవంటివన్నారు. ఈసందర్భంగా సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ను సత్కరించి ఏఎన్నార్‌ పురస్కారాన్ని అందజేశారు. వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, కళా జనార్దనమూర్తి, ఓంకార్‌రాజు, తెన్నేటి సుధాదేవి, శైలజ  పాల్గొన్నారు.