45వ జాతీయస్థాయి నాటకోత్సవాల ముగింపు వేడుకల్లో నటుడు సుబ్బరాయశర్మ

అలరించిన హాస్య నాటిక

భెల్‌కాలనీ, మే 10 (ఆంధ్రజ్యోతి): అంతరించిపోతున్న రంగస్థల కళలను, కళాకారులను ఆదరించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని సినీ-టీవీ నటుడు, దర్శకుడు సుబ్బరాయశర్మ అన్నారు. భెల్‌ టౌన్‌షి్‌పలోగల కమ్యూనిటీ సెంటర్‌లో తొమ్మిది రోజులుగా జరిగిన 45వ జాతీయ స్థాయి నాటకోత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలకు, కళాకారులకు చేయూతనందించి నాటకరంగ పురోభివృద్ధికి కృషి చేస్తున్న భెల్‌ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాపరిషత్‌లకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 45 ఏళ్ల పాటు నిర్విరామంగా నాటకోత్సవాలను నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని, నానాటికీ రంగస్థల కళాకారులకు తగ్గుతున్న ఆదరణతో నాటకరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని అన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 

సినీ, బుల్లి తెర నటి అర్చన మాట్లాడుతూ సహజత్వానికి దగ్గరగా ఉండే నాటకాలను ఆదరించినంతకాలం రంగస్థలం సజీవంగా ఉంటుందన్నారు.  రంగస్థలం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కళాకారులు తమ మాతృసంస్థను మరువకూడదన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన భెల్‌ జీఎం యుగంధర్‌ మాట్లాడుతూ  రేయింబవళ్లు కష్టించి పనిచేసే కార్మికులు శారీరకంగా, మానసికంగా అలసిపోతారని వారి ఆహ్లాదం కోసం అటవిడుపు కార్యక్రమాలు, మానసిక ప్రశాంతత చేకూరే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ సెంటర్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సరావు, వెల్ఫేర్‌ అధికారి మాయబ్రహ్మం, ప్రధాన కార్యదర్శి సురేందర్‌, సాంస్కృతిక కార్యదర్శి వేమనచారి, ఎగ్జిక్యూటీవ్‌ సభ్యులు జగదీ్‌ష, ఉమాశంకర్‌, అంకంరాజు, గాంధీ తదితరులు పాల్గొన్నారు.