పంజాగుట్ట, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గడ్డమీద జన్మించిన ఇద్దరు మహనీయ సాహిత్యకారులలో ఒకరు పీవీ నర్సింహారావు కాగా మరొకరు వట్టికోట ఆళ్వార్‌స్వామి అని ప్రముఖ విద్యావేత్త, బహుగ్రంథ రచయిత డాక్టర్‌ జి. బాలశ్రీనివాసమూర్తి అన్నారు. రంజనీ తెలుగు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏజీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచనా స్రవంతి, నూరేళ్లు నిండిన తెలుగు సాహితీమూర్తుల జీవితం, వ్యక్తిత్వం, సాహిత్య పరంపరలో 27వ భాగంగా  ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధు డు, సాహితీవేత్త వట్టికోట ఆళ్వార్‌స్వామి గురించి ఆయన మాట్లాడారు. పీవీ నర్సింహారావు లోపలి మనిషి అని, వట్టికోట ప్రజల మనిషి అన్నారు. మంచి రచయితలకు బిరుదులు, అవార్డులు, రచనల రాశి, సెలబ్‌సలో వారి పాఠాలు కొలమానం కాన్నారు. 

వట్టికోట గడిపిన అతి దుర్భరమైన జైలు జీవితం సైతం ఆనాటి నిజాం ప్రభుత్వ దౌర్జన్యాలు, దుర్భర పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేశారన్నారు. 1937-38 మధ్య కాలంలో దేశోద్ధారక గ్రంథాలయాన్ని స్థాపించి తెలుగుకు తెలంగాణలో ఒక ఉనికిని ప్రసాదించిన ధైౖర్యశాలి ఆయన అని అన్నారు. కేవలం మూడు తెలుగు పత్రికలు వెలువడే ఆనాటి తెలంగాణలో ఆయన ప్రారంభించి నడిపిన తెలుగుతల్లి ఒకటన్నారు. ప్రజల మనిషి నవల పూర్తిగా ఆయన జీవిత చరిత్ర అంటూ, గంగు జైలు లోపల, రచన వ్యాసాపరంపర ఆయనలోని మంచి మనస్తత్వానికి ప్రతీక అన్నారు. 47 సంవత్సరాలు జీవించిన అతి సామాన్యమైన జీవనం గడుపుతూ అసామాన్యమైన సాహిత్యాన్ని ప్రజలకు అందించారన్నారు. ధాశరథి, సినారె వంటి మహా కవులచే కీర్తించబడిన ఉత్తమ తెలుగు నవలాకారుడన్నారు. ఈ కార్యక్రమంలో రంజని అధ్యక్షుడు నందిరాజు పద్మలత జయరాం, ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ, ఉపాఽధ్యక్షుడు నంద్యాల మురళీకృష్ణ, సభ్యులు డాక్టర్‌ గౌరిశంకర్‌, జగ్గారావు, పాలకోడేటి తదితరులు పాల్గొన్నారు.