అమృతలత-అపురూప పురస్కారాల ప్రదానోత్సవంలో డా. కేవీ రమణాచారి

రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : సమాజాన్ని చైతన్యపరిచే సాహిత్యం రావాల్సిన అవసరముందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి అన్నారు. ప్రతిభావంతులను గుర్తించి గౌరవించుకోవడం అభినందనీయమని అన్నారు. ఆదివారం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో అమృతలత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అమృతలత-అపురూప పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి జలంధర(నవలా రచన), ఎస్పీ శైలజ(సంగీతం)లకు అమృతలత అవార్డులను, సంఽధ్య గోళ్లముడి(సేవారంగం), శీలా సుభద్రాదేవి(కవి త్వం), స్వాతి శ్రీపాద(అనువాదం), ఆచార్య శరత్‌ జ్యోత్స్నారాణి(విద్యారంగం), డా.శిలాలోలిత (కాలమిస్ట్‌), కిరణ్‌బాల(నాటికరచన), కన్నెగంటి అనసూయ(బాలసాహిత్యం), వనజా ఉదయ్‌ (నాట్యం), శ్రీలక్ష్మీ(రేడియో రంగం), తాయమ్మ కరుణ(కథారచన) తదితరులను అపురూప అవార్డులతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి పురస్కారగ్రహీతలను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. సాహిత్యంలో మహిళల పాత్ర మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ నటి షావుకారి జానకి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో అమృతలత అపురూప అవార్డు వ్యవస్థాపకురాలు డా.అమృతలత సమన్వకర్తగా వ్యవహరించగా పలువురు ప్రముఖులు పాల్గొని పురస్కారగ్రహీతలను అభినందించారు.