కడప గడపలో కాలిడడం అదృష్టం 

జలసిరి కోసం పాట రాశా 
ముఖ్యమంత్రి సంకల్పంతో ప్రతి నీటిబొట్టు ప్రజల గొంతు తడుపుతుంది
ప్రముఖ సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్‌
సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్‌

కడప, సెవెన్‌రోడ్స్‌, సెప్టెంబరు 8: కడప గడపలో కాలిడడం, ఇక్కడి గాలిని పీల్చడం అదృష్టంగా భావిస్తున్నా. కళలకు కాణాచి అయిన కడపలో దిగగానే ఒళ్లు పులకరించిందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలసిరి హారతి కోసం ప్రత్యేకంగా ఓ పాటను రచించానని చెప్పారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ నేపధ్య గాయకుడు వందేమాతరం శ్రీనివా్‌సతో కలిసి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జలసిరి హారతి కోసం ఓ పాట రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని తెలిపారు. ఆయన సూచనల మేరకు రచన చేసి వినిపించేందుకు విజయవాడలో ఆయన వద్దకు వెళ్లామని అయితే ఆయన బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తూ పాటను వినిపించామన్నారు. ఆయన ఎంతో సంతోషపడ్డారని తెలిపారు. ప్రతి నీటిబొట్టు ప్రజల గొంతు తడపాలని, పైరుకు అందాలని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఆ ఆశయం, సంకల్పంలో భాగంగా ఈ పాట రచించామని రాష్ట్రం సస్యశ్యామలం కావడంలో తమకు భాగస్వామ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ ఒక్కపాటే రాశానని, త్వరలో మరిన్ని పాటలు రాస్తానని తెలిపారు.

900కు పైగా పాటలు రాశా
తాను బీటెక్‌ చదువుతున్న సమయంలో తనకు ఆ సబ్జెక్టు కంటే సాహిత్యం ఎంతో మంచిదని తోచిందన్నారు. దీంతో అటువైపుగా వెళ్లానన్నారు. అయితే పేరుతో పాటు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశ్యంతో సినిమా పాటలు రాయడం మొదలుపెట్టానన్నారు. తొలిగా ‘కాదంటే ఔననిలే’ అనే సినిమాకు పాట రాశానని అప్పటి నుంచి ఎంతో మంది హీరోలతో పాటు చిన్న సినిమాలకు కూడా పాటలు రాస్తూ వస్తున్నానని ఇప్పటికి 900పైగా పాటలు రాశానన్నారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ హీరోగా చేస్తున్న సినిమాతో పాటు 5 సినిమాలకు అన్ని పాటలు తానే రాస్తున్నానని చెప్పారు. అనంతరం కడప నుంచి విమానంలో అనంత శ్రీరామ్‌, వందేమాతరం శ్రీనివాస్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారు.