ఉద్యమ ధూంధాం ఇప్పుడో దుకాణం

సారు దగ్గరకు పోయిన కళాకారులంతా తాలే

అసలు విత్తనాలు బయటే ఉన్నాయి.. తిరగబడతాయి : అందెశ్రీ

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ధూంధాం ఇప్పుడు ఓ దుకాణంగా మారింది. తాగి వాగే వాళ్లంతా సారు దగ్గర తాకట్టు పడ్డారు. అయితే, వాళ్లంతా తాలు మాత్రమే. తెలంగాణ ప్రజలను మరోసారి ఉద్యమం వైపు నడిపించే అసలైన విత్తనాలు బయటే ఉన్నాయి. అవే ఉద్యమ పాట కాబోతున్నాయి. పాటతో పరాచకాలొద్దు’’ అని టీఆర్‌ఎస్‌ సర్కారును ప్రముఖ కవి అందెశ్రీ హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ పేరుతో అంగడిగా మార్చొద్దన్నారు. కావాల్సింది బంగారు తెలంగాణ కాదని.. ఎన్నికైన 119 మంది ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఉన్న తెలంగాణ కావాలన్నారు.21న ఏర్పాటు కానున్న తెలంగాణ ఇంటిపార్టీ సాంస్కృతిక సైన్యం ఆవిర్భావ సభ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అధ్యక్షతన గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అందెశ్రీ.. సీఎం కేసీఆర్‌ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. ‘‘లేక దరిధ్రం ఉండొచ్చు కాని లేకి దరిద్రం ఉండరాదు’’ అని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నవ్వే విషపు నవ్వు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈనెల 21న బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇంటిపార్టీ సాంస్కృతిక సైన్యం ఏర్పాటు కాబోతుందన్నారు.