‘రంగుల చీకటి’ కథా సంకలనం ఆవిష్కరణలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మనకు తెలియని జీవిత పోరాటాల్లోని జీవన సౌందర్యం, విషాదం, ఒక మంచి హాస్యం కలగలిపే ‘రంగుల చీకటి’ కథా సంపుటి అని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ కొనియాడారు. ఆదివారం దోమల్‌గూడలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌ వేదికగా రంగస్థల దర్శకుడు చంద్రశేఖర్‌ ఇండ్ల రాసిన ‘రంగుల చీకటి’ కథాసంపుటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ చంద్రశేఖర్‌ రాసిన కథల్లో ఆడవాళ్ల భాషే చాలా కీలక మని, మానవ సంబంధాల్లో నిమగ్నమై, ఆడవాళ్ల మాటలను రచయిత చాలా పరిశీలనగా చూస్తే తప్ప వాళ్ల భాషను కథల్లో వ్యక్తీకరించడం సాధ్యం కాదని అన్నారు. తెలుగు సమాజంలోని కాలం కడుపులో మిగిలిపోయి.. రాయబడని కావ్యాలను లక్ష నోళ్లతో, కోటి కలాలతో రాయాలనే ప్రయ త్నం నుంచి వచ్చిన పిలుపును అందుకొని రాస్తున్న రచయిత చంద్రశేఖర్‌ అని కె.శ్రీనివాస్‌ అభినందించారు. కథల్లో తన అభిప్రాయాలను రుద్దడం,జొప్పించడం కానీ రచయిత ఎక్కడా చేయలేదని ఉటంకించారు.

రంగుల చీకటి కథలు తనకు చాలా బాగా నచ్చాయని, గొప్ప కథలు చదివిన అనుభూతి కలిగిందని అన్నారు. ప్రశంసలు, ప్రోత్సాహం పేరుతో వచ్చే కిరీటాలను పెద్దగా ఖాతరు చేయొద్దని రచయితకు ఆయన సూచించారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ కవి సిద్దార్థ మాట్లాడుతూ కొత్త కోణాన్ని పరిచయం చేయడంతో పాటూ జీవభాషలో రాయడం వల్ల కథల్లో సజీవత్వం ఉట్టిపడుతోందని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. పసునూరి రవీందర్‌ మాట్లాడుతూ చంద్రశేఖర్‌ కథల్లో సొంత జీవితాల తాలూకూ మూలాలు, దళితుల మతపరమైన అస్తిత్వాన్ని ప్రస్తావించారని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకురాలు జ్యోతి కథలను విశ్లేషించారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం థియేటర్‌ ఆర్ట్స్‌ ఆచార్యులు రాజీవ్‌ వెలిచేటి, ప్రముఖ కథారచయిత మహ్మద్‌ ఖదీర్‌బాబు, రచయిత్రి మానస ఎండ్లూరి, అపర్ణ తోట తదితరులు పాల్గొన్నారు.