కూచిపూడి : తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకల సందర్భంగా అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్స్‌ అకాడమీ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడిలో నిర్వహించిన మువ్వల సవ్వడులు అలరించాయి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 300 మంది కళాకారులు 30 బృందాలుగా అన్నమాచార్య కీర్తనలకు అనుగుణంగా కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించి నీరాజనాలు పలికారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీలత బృందం అలరులు కురియగా....అంటూ నర్తించారు. పార్వతీపురానికి చెందిన రజని రాజ కళాక్షేత్రం విద్యార్థులు ఆకట వేళల...నాట్యాంశాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్‌కు చెందిన రేణుకా ప్రభాకర్‌ బృందం అందరికీ అభయంబు ఇచ్చు చెయ్యి.... ప్రదర్శించారు. వరంగల్‌కు చెందిన భ్రమరాంబ శిష్య బృందం ఏమని పొగడుదునే.... అంటూ అభినయించారు. విజయవాడకు చెందిన శైలశ్రీ బృంద సభ్యులు అలవేలు మంగ... అంటూ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. ఏలూరుకు చెందిన పార్వతీ రామచంద్రన్‌ కట్టేదురా...వైకుంఠము అంటూ నాట్యాన్ని నర్తించారు. విజయవాడకు చెందిన ఉషామాధవి బృందం ఇట్టి ముద్దులాడేటి... అంటూ అభినయించారు. హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి నాట్య అకాడమీ బృందం జయలక్ష్మీ....వరలక్ష్మీ అంటూ కీర్తనలకు అనుగుణంగా నర్తించి అన్నమాచార్యులకు నాట్య నీరాజనాలు పలికారు. వీరితోపాటు ఉభయ రాష్ట్రాలకు చెందిన కళాకారులు అన్నమాచార్య కీర్తనలోని ప్రాచుర్యం పొందిన వినరో భాగ్యము విష్ణుకథ, ముద్దుగారే యశోద, బ్రహ్మకడిగిన పాదము, కులుకుగా నడవరో కోమలాల....ఏమని పొగడుదునే.. అంతయునీవే హరి.. అంతరంగ వంటి కీర్తనలకు కూచిపూడిలో అభినయించి ప్రేక్షకులను రంజింపచేశారు. తొలుత అఖిల భారత కూచిపూడి నాట్యకళామండలి కార్యదర్శి కేశవప్రసాద్‌తోపాటు పలువురు కళాకారులు జ్యోతి వెలిగించి సభా కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా కేశవప్రసాద్‌ బృందం పలు అన్నమాచార్య కీర్తనలను ఆలపించి నాట్యాంశాలకు శ్రీకారం చుట్టారు.

కూచిపూడి నాట్యం అజరామరం

కూచిపూడి నాట్యం అజరామరమని పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు పేర్కొన్నారు. అన్నమాచార్య జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూచిపూడి అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు చిరువోలు బుచ్చిరాజు, ఆంధ్రా బ్యాంక్‌ మేనేజర్‌ గరికపాటి నాగేశ్వరరావు, గౌరికృష్ణ, అఖిలభారత కూచిపూడి నాట్యకళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌లు కళాకారులను మెమోంటోలతో ఘనంగా సత్కరించి అభినందించారు.