విశ్వనాథ్‌ మన జాతి సంపద.. సత్కార సభలో సీఎం

కళాతపస్వికి గజమాల, జ్ఞాపిక ప్రదానం
 
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘కొంత మందికి భగవంతుడు కొన్ని కళలను పుట్టుకతోనే ఇస్తాడు. ఆదే భవిష్యత్‌లో జాతి సంపద అవుతుంది. ఇలాంటి జాతి సంపద మన కాశీనాథుని విశ్వనాథ్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా గర్వించదగ్గ బిడ్డ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న సన్మానం ఆయనకు చేస్తున్నది కాదు.. తెలుగు జాతికి చేస్తుందిగా భావిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లిలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్న కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు శాలువాతో పాటు గజమాలతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. ‘తాను ఎంచుకున్న రంగాన్ని నమ్ముకుని, కష్టపడి పని చేస్తే చరిత్ర సృష్టింవచ్చని విశ్వనాథ్‌ నిరూపించారు. ఆయన్ను సత్కరించడం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నలుగురు ప్రముఖ వ్యక్తులు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు విశ్వనాథ్‌ ఆ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం’ అని కొనియాడారు. మనిషికి మానసిక ఆనందం ఇచ్చేవి కళలు, సంస్కృతి, నృత్యం మాత్రమేనని సీఎం తెలిపారు. సంగీతం, నాట్యం, నాటకం, చిత్రలేఖనం, జానపద కళలు, భాషాభివృద్ధికి ఆరు సంస్థలను ప్రారంభిస్తామని చెప్పారు. కూచిపూడి మన రాష్ట్రంలో పుట్టిన నృత్యమని, పునర్వైభవం తెచ్చేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశామన్నారు. కూచిపూడి గ్రామంలో 55 ఎకరాలు కేటాయించడంతో పాటు రూ.6 కోట్లతో అక్కడ ఉన్న చెరువును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 1200 పాఠశాలల్లో కూచిపూడి నృత్య తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘నేను ఉదయం నుంచి ఎంతో కష్టపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చి విశ్వనాథ్‌ జీవిత చరిత్రను పది నిమిషాలు చూడగానే ఆ కష్టమంతా మరచిపోయాను. మరో కొత్త ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది’ అని సీఎం తెలిపారు.
 
నా కర్తవ్యం నెరవేర్చా: కళాతపస్వి
కళాతపస్వి విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. విశిష్ట పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘నేను ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడు ఏం మాట్లాడానో... ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను. నా జీవితంలో అవార్డులు శాశ్వతం కాదు. తల్లిదండ్రులు ఉంగరం పట్టి రాయించినదే నాకు శాశ్వతం. దేవుడు నాకు ఆయుధం ఇచ్చాడు కాబట్టి నా డ్యూటీ నేను చేశాను. ఆలికి అన్నం పెట్టినంత మాత్రాన ఊరికి ఉపకారం చేసినట్లు కాదు. నా కర్తవ్యం నేను నెరవేర్చానంతే’ అని వ్యాఖ్యానించారు. అవార్డు రావడం ఆలస్యమైందని చాలా మంది అంటున్నారని, కానీ భగవంతుడు ఆలస్యం చేస్తాడు కానీ.. అన్యాయం చేయడని తాను నమ్ముతానని చెప్పారు. ఎన్ని బాధ్యతలు ఉన్నా సన్మాక కార్యక్రమానికి వచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, పరకాల ప్రభాకర్‌, డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.