ఆర్యవైశ్యులకు ఆయన క్షమాపణ చెప్పాలి

రెండు రాష్ట్రాల్లోనూ పుస్తకాన్ని నిషేధించాలి
తెలంగాణ, ఏపీల్లో కొనసాగిన నిరసనలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లంటూ పుస్తకం రాసిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్య వైశ్య సంఘాలు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దుకాణాల బంద్‌ పాటించారు. ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఛత్రినాక చౌరస్తా నుంచి లాల్‌దర్వాజ మోడ్‌ వరకు పాతబస్తీ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించి ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నాయకులు తార్నాక నుంచి ఓయూ పోలీస్ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కుత్బుల్లాపుర్‌, ఉప్పల్‌, మౌలాలి తదితర ప్రాంతాల్లోనూ నిరసన తెలిపారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో బ్రాహ్మణ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యూత్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లాది చంద్రమౌళి, మన బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి నరసింహశర్మ, బ్రాహ్మణ్‌ యునిటీ ఫర్‌ ఎవర్‌ కో ఆర్డినేటర్‌ కృష్ణమోహన్‌లు మాట్లాడుతూ.. మతాలు, కులాల పేరుతో హిందువులపై విషం చిమ్ముతున్నారని, ఇదే వైఖరి కొనసాగితే ఆయనను సమాజం నుంచి వెలి వేస్తామని హెచ్చరించారు. కాగా కామారెడ్డి, తాడ్వాయిలలో నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. ఐలయ్య పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని వరంగల్‌లో ఆర్యవైశ్య సంఘం నాయకుడు గుండా ప్రకా్‌షరావు అన్నారు.
 
ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు..
ఏపీలోని ప్రకాశం, పశ్చిమ గోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఆర్యవైశ్య సంఘాలు నిరసన తెలిపాయి. వైశ్యులకు కంచ ఐలయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు డిమాండ్‌ చేశారు. మరోవైపు కంచ ఐలయ్యపై ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ విభాగం నాయకులు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. నవంబరు 20వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ను హెచ్చార్సీ ఆదేశించింది.